ఎల్బీనగర్ నుంచి హయత్‌‌​నగర్ వరకు మెట్రో పొడిగించండి: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

ఎల్బీనగర్ నుంచి హయత్‌‌​నగర్ వరకు మెట్రో పొడిగించండి: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

సీఎం కేసీఆర్‌‌‌‌కు కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు:
హైదరాబాద్‌‌లోని ఎల్బీ నగర్ నుంచి హయత్​నగర్ (అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్) వరకు మెట్రోను పొడిగించాలని సీఎం కేసీఆర్‌‌‌‌ను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సిటీ ఆ ప్రాంతం వైపు వేగంగా విస్తరిస్తున్నదని, దీంతో అక్కడికి మెట్రో సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం కేసీఆర్‌‌‌‌కు లేఖ రాశారు. చాలా మంది హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్‌‌‌‌కు వెళ్లి మెట్రో ఎక్కుతున్నారని, దీంతో ఆ లైన్‌‌ను పొడిగించాలని డిమాండ్ చేశారు. హయత్‌‌నగర్‌‌‌‌ వరకు మెట్రో లైన్‌‌ను పొడిగించే యోచనలో రాష్ట్ర సర్కార్‌‌‌‌ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ప్రతిపాదనలను పంపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో హైవే 65ని కేంద్ర ప్రభుత్వం 6 లేన్లుగా మారుస్తున్నదని, దీంతో అక్కడ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మెట్రోను విస్తరిస్తే ట్రాఫిక్‌‌ సమస్య  తీరుతుందన్నారు. ఈ లైన్ విస్తరణకు గతంలోనే తాను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశానని గుర్తుచేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారన్నారు. తర్వాత ఆ లేఖను రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వర్డ్ చేశారని చెప్పారు.