ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

ఇంట‌ర్ పరీక్షల ఫీజుకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు వార్షిక పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరోసారి అవకాశం ఇచ్చింది. రూ 100 ఆలస్య రుసుముతో ఈ నెల 12వ తేదీ వరకు ఇంటర్‌‌ ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. విద్యార్థులు వారి కాలేజీల్లో ఫీజులను చెల్లించాలని సూచించింది. స్టూడెంట్ల నుంచి ఫీజులను స్వీకరించే కాలేజీలు.. డిసెంబర్ 13వ తేదీలోగా ఇంటర్ బోర్డుకు ఫీజుల మొత్తాన్ని బదిలీ చేయాలని ఆదేశించింది. 

విద్యార్థుల వినతి మేరకు.. 

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 14 నుంచి 30లోపు ఫీజులు చెల్లించాలని గతంలో ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 నుంచి 6 వరకు రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు వెయ్యి రుసుముతో 14 నుంచి 17 వరకు రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే విద్యార్థుల వినతి మేరకు తాజాగా కేవలం రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 12 వరకు ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్‌, వొకేషనల్‌ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు. 

పాత పద్దతిలోనే..

మరోవైపు.. ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది 100 శాతం సిలబస్‌ అమలవుతుందని.. పాత పద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కళాశాలల్లో అడ్మిషన్‌ పొందకుండా.. హాజరు శాతం లేకుండా హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయెచ్చని సూచించారు.