వచ్చే నెల హ్యుందాయ్ బండ్ల ధరల పెంపు

వచ్చే నెల హ్యుందాయ్ బండ్ల ధరల పెంపు

న్యూఢిల్లీ : పెరుగుతున్న ఇన్‌‌‌‌పుట్, సరుకులు ధరలు, డాలర్​ విలువ తగ్గుదల  కారణంగా వచ్చే నెల నుంచి తమ వెహికల్స్ ధరలను పెంచనున్నట్టు  హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గురువారం వెల్లడించింది.   గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఐకానిక్​5 వరకు పలు బండ్లను ఇది అమ్ముతోంది. వీటి ధరలు రూ. 5.84 లక్షల నుంచి రూ. 45.95 లక్షల మధ్య ఉన్నాయి. అయితే, జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చే కొత్త ధరల వివరాలను పేర్కొనలేదు.

హెచ్​ఎంఐఎల్​ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, కంపెనీ ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. పెరుగుతున్న ఇన్‌‌‌‌పుట్ వ్యయంలో కొంత భాగాన్ని  కస్టమర్​కు బదిలీ చేయడం ఇప్పుడు అత్యవసరమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వినియోగదారులపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. జనవరిలో వెహికల్స్ ధరలను పెంచుతున్నట్టు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్​ మహీంద్రా, హోండా,  ఆడి ఇది వరకే ప్రకటించాయి.