- సరోజినీ దేవి ఐ హాస్పిటల్ను హబ్గా మారుస్తం
- మండలిలో మంత్రి దామోదర వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను చేరువ చేస్తామని, ఇందుకోసం తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన డే కేర్ క్యాన్సర్ సెంటర్ల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ఐ కేర్ క్లినిక్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. కంటి వైద్యానికి సరోజినీదేవి ఐ హాస్పిటల్ను హబ్గా మారుస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే జిల్లాల్లోని డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ద్వారా కీమోథెరపీ వంటి సేవలు అందిస్తూ హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే హాస్పిటల్ పై ఒత్తిడి తగ్గించగలిగామని తెలిపారు. అదే స్ఫూర్తితో 35 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, 64 ఏరియా హాస్పిటల్స్ లో ఉన్న ఆప్తాల్మాలజీ డిపార్ట్ మెంట్లను బలోపేతం చేస్తామన్నారు. వీటిలో టెస్టులే కాకుండా పూర్తిస్థాయి చికిత్స అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
క్యాంపులు కాదు పర్మినెంట్ క్లినిక్స్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేవలం క్యాంపులు నిర్వహించి, కండ్లద్దాలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
కంటి వెలుగు స్క్రీనింగ్ లో సుమారు 9.3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమని తేలినప్పటికీ... వారికి ఆపరేషన్లు చేయించలేదని సభ దృష్టికి తెచ్చారు. తమ ప్రభుత్వం క్యాంపులకే పరిమితం కాకుండా.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పర్మినెంట్ క్లినిక్ వ్యవస్థను తెస్తున్నదని చెప్పారు.
జిల్లాలోనే అన్ని రకాల వైద్యం..
జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సేవలు అందించామని మంత్రి దామోదర వెల్లడించారు. 2024–25లో ఇప్పటివరకు 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
అలాగే స్కూల్ స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించి.. 33 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించి, 76 వేల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. ఏ జిల్లా పేషెంట్లకు ఆ జిల్లాలోనే పూర్తి వైద్యం అందేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
