హైదరాబాద్ ఫేస్ బుక్ హ్యాకర్ అరెస్ట్

హైదరాబాద్ ఫేస్ బుక్ హ్యాకర్ అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: ఫేస్ బుక్ హ్యాక్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని సైబర్ క్రైం విభాగాన్ని బాధితులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు, హ్యాకింగ్ పాల్పడిన అకౌంట్ వివరాల ఆధారంగా కేసును చేధించారు. మౌలాలీకి చెందిన మహ్మద్ మునీర్ అహ్మద్(22)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

ఫేక్ అకౌంట్ తో హ్యాక్

మౌలాలీకి చెందిన మునీర్ అహ్మద్ బీటెక్ పూర్తి చేశాక ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో చేరాడు. జడ్ షాడో ఆప్లికేషన్ ను నేర్చుకున్నాడు. దీని సాయంతో మెలిన్ సోఫియా అనే ఫీమేల్ ప్రొఫైల్ తో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. దాని ఆధారంగా ఫిషింగ్ లింక్ ను మెసెంజర్ లో పంపిస్తాడు. ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేశారంటే, ఎదుటి వ్యక్తికి చెందిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ హ్యాకర్ కు చేరవేస్తోంది. మహ్మద్ మునీర్ అహ్మద్ ఈ ఐడీ, పాస్ వర్డ్ తో ఫేస్ బుక్ హ్యాక్ చేసి అసభ్యకరమైన మెసేజ్ లను పోస్టు చేస్తామంటూ యూజర్లను బెదిరించడంతో పాటు, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఓ ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు.

అనవసరపు లింక్ లను క్లిక్ చేయొద్దు…

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ లను, వీడియో లింక్ లను క్లిక్ చేయకపోవడమే మంచిదని రాచకొండ సైబర్ పోలీసులు సూచించారు. సైబర్ క్రైంలో ఫిషింగ్ లింక్స్ అయిన వీటితో, వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేయడం ఎంతో సులువుగా ఉంటుందనీ, దీని ఆధారంగానే సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతారనీ రాచకొండ సైబర్ క్రైం టీం వివరిస్తోంది. ఈ  కేసును చాకచక్యంగా ఛేదించిన ఎల్ బీనగర్ సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్  జలంధర్ బృందాన్నిరాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ అభినందించారు.