ఎంవీఏ కూటమికి సంఖ్యాబలం లేదు

ఎంవీఏ కూటమికి సంఖ్యాబలం లేదు

న్యూఢిల్లీ/ముంబై/గౌహతీ: మహా వికాస్​ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్​ మంగళవారం ఆరోపించారు. ఎంవీఏ ప్రభుత్వంలో తాము కొనసాగట్లేదంటూ 39 మంది శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలు ప్రకటించారని చెప్పారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్​ థాక్రేకు సూచించాలంటూ గవర్నర్​ భగత్​ సింగ్​ కొషియారీకి ఫడ్నవీస్​ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఫడ్నవీస్.. దాదాపు అరగంట పాటు పార్టీ చీఫ్​ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తిరుగు ప్రయాణంలో ముంబై ఎయిర్​ పోర్ట్​లో దిగిన తర్వాత నేరుగా రాజ్​ భవన్​కు వెళ్లారు. ఆయన వెంట బీజేపీ మహారాష్ట్ర చీఫ్​ చంద్రకాంత్​ పాటిల్, గిరీశ్​ మహాజన్​ కూడా గవర్నర్​ను కలిశారు. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్​కు అందజేసిన లేఖలో ఫడ్నవీస్  కోరారు.

నాతో కూర్చుని మాట్లాడండి.. ఉద్ధవ్​

‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరంతా తిరిగి ముంబై రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాతో కూర్చుని మాట్లాడండి. అందరం కలిసి శివసైనికుల్లో, జనాల్లో ఉన్న అన్ని గందరగోళాలను తొలగిద్దాం. మీరు తిరిగి వచ్చి నాతో మాట్లాడితే ఏదైనా మార్గం దొరక్కపోదు. పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబానికి పెద్దగా మీ అందరి గురించి నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నా” అని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే రెబెల్​ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తాను బలపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమని, ఒకవేళ బలపరీక్ష జరిగితే రెబెల్​ ఎమ్మెల్యేల్లో చాలామంది తనకు మద్దతు ఇస్తారని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఉద్ధవ్​ శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలకు ఒక లేఖ రాశారు. కొంతమంది రెబెల్​ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తనకు టచ్​లో ఉన్నారని, పార్టీ గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారని అందులో పేర్కొన్నారు. ‘‘కొన్ని రోజులుగా మీరు గౌహతీలో ఉండిపోయారు. మీ గురించి ప్రతిరోజూ ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మీలో చాలా మంది నాతో టచ్​లో ఉన్నారు. మీరు ఇప్పటికీ శివసేనతోనే ఉన్నారని మీ ఆలోచనలే చెబుతున్నాయి” అని అన్నారు. సుమారు 20మంది రెబెల్​ లీడర్లు తమతో టచ్​లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించండి: షిండే

మరోవైపు గౌహతీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు పార్టీ లీడర్​షిప్​తో టచ్​లో ఉన్నారో వెల్లడించాలని, వారి పేర్లను బయటపెట్టాలని రెబెల్​ గ్రూపు లీడర్​ ఏక్​నాథ్​ షిండే డిమాండ్​ చేశారు. తాము త్వరలోనే ముంబై వస్తామన్నారు. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. వీరంతా తమకు తాముగా వచ్చారని అన్నారు. హిందూత్వ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంపైనే వీరంతా దృష్టి పెట్టారని చెప్పారు..