యాదాద్రి పునర్నిర్మాణంలో లోపించిన ప్లానింగ్

యాదాద్రి పునర్నిర్మాణంలో లోపించిన ప్లానింగ్

కట్టినవి కూల్చుతున్నారు.. కూల్చినవే మళ్లీ కడుతున్నారు.. కొన్ని నిర్మాణాలను కొన్ని రోజులకే క్లోజ్​ చేసి అక్కడ మరో నిర్మాణం చేపడుతున్నారు. యాదాద్రి పునర్నిర్మాణంలో జరుగుతున్న తంతు ఇది. కన్​స్ట్రక్షన్​లో పదే పదే మార్పులు చేయడం ప్రభుత్వం, ఆఫీసర్ల ప్లానింగ్​ లోపానికి అద్దం పడుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల భారీగా ప్రజాధనం వృథా కావడంతో పాటు టైం వేస్ట్​ అవుతోంది.  ఇప్పటికే రథ మండపాన్ని రెండు సార్లు, పుష్కరిణిని మూడుసార్లు మార్చారు. వాస్తు సరిగ్గా లేదన్న కారణంతో కొండ మీద ఉన్న సబ్​స్టేషన్​ను తొలగించగా.. ఫ్లైఓవర్​ నిర్మాణం పేరుతో బోటింగ్​ను నిలిపివేశారు.
యాదాద్రి, వెలుగు: యాదాద్రి పునర్నిర్మాణంలో రూ.కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. నిర్మాణాల్లో తరచూ మార్చులు, చేర్పులు జరుగుతున్నాయి. నిర్మించిన వాటిని  కూల్చడం, మళ్లీ కట్టడం చేస్తున్నారు. దీంతో పనులు ఆలస్యం కావడంతో పాటు ఆర్థికంగానూ నష్టం జరుగుతోంది. సీఎంగా కేసీఆర్​ బాధ్యతలు స్వీకరించాక యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తరహాలో తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ అథారిటీ(వైటీడీఏ) ఏర్పాటు చేసి మొత్తం రూ. 1,200 కోట్లు కేటాయించారు. ఏప్రిల్​ 2016లో బాలాలయాన్ని నిర్మించి.. అందులో స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఆ వెంటనే కొత్త టెంపుల్​ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 
ప్లానింగ్​ సరిగా లేక..
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడాలకు ప్లానింగ్​ కరెక్ట్​ లేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే తరచూ నిర్మాణంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించడానికి సీఎం కేసీఆర్​ 15 సార్లు వచ్చారు. నిర్మాణంలో మార్పుల విషయంలో పలు సూచనలు చేశారు. నిర్మాణాలను పర్యవేక్షించే ఆఫీసర్లు సైతం కొన్ని మార్పులు చేశారు. దీంతో కోట్ల రూపాయలు వేస్ట్​ అయ్యాయి. ఆలయం పూర్తిగా అందుబాటులో వచ్చేనాటికి ఇంకెన్ని మార్పులు జరుగుతాయోనని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
రథ మండపం రెండుసార్లు మార్పు..
స్వామి  రథం కోసం మొదటగా క్యూ కాంప్లెక్స్​పై రథ మండపం నిర్మించారు. నిర్మాణం పూర్తైన తర్వాత టెంపుల్​కు వచ్చిన సీఎం కేసీఆర్​.. ప్రెసిడెన్షియల్​ సూట్​ నిర్మిస్తున్న చోటుకు వెళ్లి చూశారు. రథ మండపం కారణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆలయ రాజ గోపురాలు కన్పించలేదు. దీంతో రథ మండపాన్ని తొలగించి వేరే చోట నిర్మించాలని ఆదేశించారు. ఇప్పుడు పశ్చిమ, ఉత్తర రాజగోపురాల మధ్య రథ మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపాన్ని రెండుసార్లు నిర్మించడం వల్ల దాదాపు రూ.4 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
క్యూ కాంప్లెక్స్​లో..
కొండపై  10 వేల మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకునేందుకు వీలుగా మొదట కాంప్లెక్స్​  నిర్మించారు. చివరకు క్యూ కాంప్లెక్స్​గా మార్చారు. ఉత్తరం వైపు క్యూ కాంప్లెక్​ పొడవును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తరం వైపు కొంత భాగాన్ని తొలగించారు. ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు తొలగించిన భాగాన్ని మళ్లీ నిర్మిస్తున్నారు.
శివాలయం ప్రహరీ తొలగింపు..
కొండపైన శివాలయంలోనూ పలు మార్పులు చేశారు. శివాలయం ఆవరణలో మొదట రామాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్​ సూచనతో తొలగించారు. అదే విధంగా శివాలయం సరిగా కన్పించడం లేదన్న కారణంతో ముందు వైపు నిర్మించిన ప్రహరీని తొలగించారు.
రెండు సార్లు ఫ్లోరింగ్​..
ఆలయం చుట్టూరా ఫ్లోరింగ్​ను రెండుసార్లు వేయాల్సి వచ్చింది. మొదటగా సాయిల్​ టెస్టింగ్​ చేయకుండా ఫ్లోరింగ్​ వేశారు. గతేడాది కురిసిన వర్షాలతో ఫ్లోరింగ్​ కుంగిపోయింది. దీంతో తూర్పు వైపు ఉన్న కల్యాణ మండపం నుంచి దక్షిణం వైపు వరకు ప్లోరింగ్​ మొత్తం తొలగించి సాయిల్​ టెస్టింగ్​ చేయించారు. ఆ తర్వాత మళ్లీ  ఫ్లోరింగ్​ వేశారు. కొండపైకి వెళ్లే పాత ఘాట్​రోడ్డుపై ప్రయాణికుల కోసమని హాల్టింగ్​ షెల్టర్​ నిర్మాణం కోసం సాయిల్​ టెస్టింగ్​ నిర్వహించడంతో పాటు పిల్లర్లు కూడా వేసి గ్రీనరీ ఏర్పాటు చేశారు. చివరకు పనులు ఆపేశారు. ఇప్పుడు పాత ఘాట్​ రోడ్డును మూసేశారు.
బోటింగ్​ బంద్​..
స్వామివారి దర్శనం తర్వాత భక్తులు సరదాగా గడపడం కోసం కొండకింద ఉన్న తులసి వనంలో రూ.2 కోట్లు ఖర్చు చేసి సరస్సుతోపాటు బోటింగ్​ ఏర్పాటు చేశారు. 6నెలలు కూడా ఈ బోటింగ్​ నడవలేదు. తాజాగా కొండపైకి ఫ్లైఓవర్​ నిర్మించాలనే నిర్ణయానికొచ్చి బోటింగ్​ను నిలిపివేశారు. ఇప్పుడు బోటింగ్​ సరస్సులో ఫ్లై ఓవర్​ పిల్లర్లు వేస్తున్నారు. 
కొండను తొలిచి వదిలేశారు..
యాదాద్రిలో గిరి ప్రదక్షిణ కోసమని.. గండి చెరువు వైపు కొండను పూర్తిగా తొలిచారు. ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేసి.. రింగ్​ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇప్పుడు కొండ చుట్టూ రింగ్​ రోడ్డును నిర్మిస్తున్నారు. 
టెంపుల్​ సిటీకి రిటర్నింగ్​ వాల్..
యాదాద్రిలోని టెంపుల్​ సిటీకి వెళ్లడానికి వేసిన రోడ్లకు ముందుగా ఇనుప జాలీలతో గోడలు నిర్మించారు. 2020 స్టార్టింగ్​లో కురిసిన భారీ వర్షాలకు ఈ గోడలతో పాటు రోడ్డు కూడా కూలిపోయింది. దీంతో ఈసారి రిటర్నింగ్​ వాల్​ ఏర్పాటు చేశారు. 
పిల్లర్లు మళ్లీ నిర్మాణం..
రింగ్​రోడ్డు లోపలి వైపు గతంలో కొండ మీదకు వెళ్లడానికి వీలుగా ఫ్లైఓవర్​ వేయడానికి వీలుగా ఆరు పిల్లర్లు వేశారు. ఆ తర్వాత వాటిని తొలగించి.. కొంత దూరంలో ఇప్పుడు మళ్లీ వేస్తున్నారు. 
వాస్తుకు విరుద్ధమని..
వాస్తుకు విరుద్ధంగా ఉందని కొండ మీద తూర్పు వైపు ఉన్న సబ్​స్టేషన్​ను తొలగించారు. రింగ్​ రోడ్డు లోపల ఎలాంటి నిర్మాణాలు ఉండవద్దని సీఎం కేసీఆర్​ చెప్పడంతో అక్కడ ఉన్న సబ్​స్టేషన్​ను తొలగించారు. ఇప్పుడు ఎక్కడ సబ్​స్టేషన్​ ఏర్పాటు చేస్తారో తెలియకుండా ఉంది. 


పుష్కరిణి మూడుసార్లు..
కొండపై ఉన్న పుష్కరిణిని మూడు సార్లు మార్పులు చేశారు. మొదటిసారి పుష్కరిణి యథాతథంగా అలానే ఉంచి.. పై భాగంలోని శిలపై ఏనుగు లేదా సింహం బొమ్మ ఏర్పాటు చేయాలని భావించారు. అందుకనుగుణంగా మార్పులు చేశారు. మొత్తం కొత్తగా నిర్మిస్తున్నప్పుడు పాత పుష్కరిణి ఎందుకనుకున్నారేమో.. దాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించారు. భక్తులు అక్కడే స్నానాలు చేస్తారని భావించారు. ఆ తర్వాత కొండకిందే స్నానాలు చేయాలని మార్పులు చేశారు. గత నెల 21న యాదాద్రికి వచ్చిన కేసీఆర్​.. పుష్కరిణిలో మార్పులు చేయాలని సూచించారు. దీంతో సగం కూల్చి మళ్లీ నిర్మిస్తున్నారు. పుష్కరిణిలో భక్తులు స్నానం చేయకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్న బాత్​రూంలు ఎవరి కోసం అనేది స్పష్టత లేదు. 

స్పెషల్​ సెక్రటరీ ఏం చేస్తున్నట్టు?
యాదాద్రి ఆలయ పనులను స్థానిక ఆఫీసర్లు సహా సీఎంవో స్పెషల్​ సెక్రటరీ భూపాల్​రెడ్డి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయన వారానికోసారి యాదాద్రికి వచ్చి పనులు పరిశీలించి సీఎం కేసీఆర్​కు రిపోర్ట్​ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎం కేసీఆర్​ యాదాద్రికి వచ్చినప్పుడే మార్పులు సూచించడం పరిపాటిగా మారింది. కేసీఆర్​ వచ్చేంత వరకూ భూపాల్​రెడ్డి ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. మొత్తానికి ప్లానింగ్​ లోపంతో సమయంతో పాటు ప్రజాధనం వృథా అవుతోంది.