వీడు మామూలోడు కాదు.. ఏసీబీ అధికారినంటూ రూ. కోటిన్నర వసూలు

వీడు మామూలోడు కాదు.. ఏసీబీ అధికారినంటూ రూ. కోటిన్నర వసూలు

ఏసీబీ అధికారినంటూ వసూళ్లుకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ నూతేటి జయకృష్ణ అనే వ్యక్తి..ఏసీబీ అధికారి లెక్క కలరింగ్ ఇస్తూ పలువురు ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. వారి నుంచి దాదాపు రూ. కోటిన్నర దాకా వసూలు చేశాడు. అయితే నేరాల చిట్టా నిండి..శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు చిక్కాడు. 

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ ..2016 లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఓ కంపెనీలో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేశాడు. 2017 లో ఎస్సై పరీక్షకు రాశాడు. అందులో ఉత్తీర్ణుడు కాకపోవడంతో జల్సాలకు అలవాటు పడిన జయకృష్ణ.. అనంతపురం 2 టౌన్ పీఎస్  పరిధిలో  చైన్ స్నాచింగ్ ల కు పాల్పడ్డాడు. అదే కేసుకు సంబంధించి 5 రోజుల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తిరిగి ఎస్సై కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన జయకృష్ణ..2019 లో ఏసీబీ అధికారినంటూ చెప్పుకొని తిరిగే బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి  జైలుకు వెళ్ళాడు.  జైలులో అనిల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పోలీసులకు దొరకకుండా నేరాలు ఎలా చేయాలి..అనే విషయంలో  శ్రీనాథ్ రెడ్డి, అనిల్ నుంచి సలహాలు తీసుకున్నాడు. ఆ  తర్వాత జయకృష్ణ సైతం నకిలీ ఏసీబీ అధికారి అవతారం ఎత్తాడు. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు శాఖల ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి తాను ఏసీబీ అధికారిని అంటూ... మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయని బెదిరింపులకు దిగాడు.  కలిసి సెటిల్ చేసుకో అని బెదిరిస్తూ వారివద్ద నుంచి సుమారు రూ. 1.2 కోట్లను వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధుల అకౌంట్లలో జమ చేసి ఆపై తిరిగి విత్ డ్రా చేసుకొని వాడుకునేవాడు. తెలుగు రాష్ట్రాలలో 4 ఏళ్ల కాలంలో అనేక మందిని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

జయకృష్ణపై  16 చైన్ స్నాచింగ్ కేసుల్లో పాత నేరస్తుడిగా 6 సార్లు జైలుకు వెళ్ళొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడుపై తెలుగు రాష్ట్రాల్లో 34 కేసులు ఉన్నాయని... వీటిలో 16 దొంగతనం కేసులు, 18 ఫేక్ ఏసీబీగా అధికారుల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులు ఉన్నాయి.  అయితే జులై 20వ తేదీ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తొండుపల్లి వద్ద  అనుమానాస్పదంగా కనిపించిన జయకృష్ణను శంషాబాద్ జోన్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడి నుంచి రూ.  85,000 నగదు, రూ. 2,24,000 లక్షల ఫ్రోజెన్ అమౌంట్,8 సెల్ ఫోన్లు,5 సిమ్ కార్డులుతో పాటు 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకొని..రిమాండ్ కు తరలించారు.