Rajinikanth Movie: రజనీ నిర్మాతకు షాక్.. వెంటనే ఆ రూ.2.52 కోట్లు కట్టకపోతే జైలుకే.. హైకోర్టు కీలక తీర్పు

Rajinikanth Movie: రజనీ నిర్మాతకు షాక్.. వెంటనే ఆ రూ.2.52 కోట్లు కట్టకపోతే జైలుకే.. హైకోర్టు కీలక తీర్పు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తొలి మోషన్ క్యాప్చర్ 3D యానిమేషన్ మూవీ కొచ్చడైయాన్. (తెలుగులో విక్రమసింహ). ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. 2014లో విడుదలైన ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్ర నిర్మాత జె. మురళి మనోహర్ రూ.2.52 కోట్ల పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిర్దేశించిన గడువులో ఈ మొత్తం చెల్లించకపోతే ఆరు నెలల జైలు శిక్ష అమలులోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

కేసు వివరాలు:

2014లో విడుదలైన కొచ్చడైయాన్ భారతదేశంలో పూర్తిస్థాయి ఫోటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన తొలి చిత్రం. ఈ వినూత్న ప్రయత్నం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఆ ఖర్చులను భరించేందుకు నిర్మాత సంస్థ మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ ఫైనాన్సర్ల నుంచి అప్పు తీసుకుంది.

బెంగళూరుకు చెందిన యాడ్‌బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి నిర్మాత మురళి మనోహర్ రుణం పొందారు. అప్పు తిరిగి చెల్లింపుల భాగంగా 2014లో యాడ్‌బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబిర్ చంద్ నహర్‌కు రూ.5 కోట్ల చెక్ జారీ చేశారు. అయితే ఆ చెక్ “స్టాప్ పేమెంట్ బై డ్రాయర్” కారణంగా బౌన్స్ కావడంతో ఫైనాన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో AdBureau సంస్థ నిర్మాత మురళి మనోహర్పై Negotiable Instruments Act సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ కేసు నమోదు చేసింది.

న్యాయపరమైన పరిణామాలు.. 

ఈ కేసులో 2021 డిసెంబరులో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్మాతను దోషిగా తేల్చి, ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.7.70 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును 2023లో చెన్నై సెషన్స్ కోర్టు కూడా సమర్థించింది.

ఈ క్రమంలోనే సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిర్మాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందర్ మోహన్ 2026 ఫిబ్రవరి 9న తుది తీర్పును వెలువరించారు. తాజాగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, పరిహారం మొత్తాన్ని రూ.2.52 కోట్లుగా నిర్ణయించింది. 

హైకోర్టు తీర్పు

రెండు పక్షాల వాదనలు, పత్రాలను పరిశీలించిన హైకోర్టు, అసలు బాకీ మొత్తానికి రెట్టింపు అయిన రూ.2.52 కోట్లను నాలుగు వారాల్లోపు AdBureau సంస్థకు చెల్లించాలని నిర్మాతకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే, గతంలో విధించిన ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష అమల్లోకి వస్తుందని హెచ్చరించింది.

అయితే, ఈ వివాదం పూర్తిగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినదేనని, సినిమా విజయాపజయాలతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కొచ్చడైయాన్ చిత్రానికి సంబంధించిన పాత ఆర్థిక సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది.