Jana Nayagan : విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మద్రాస్ హైకోర్టులో వీడిన 'జననాయగన్' చిక్కుముడి!

Jana Nayagan : విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మద్రాస్ హైకోర్టులో వీడిన 'జననాయగన్' చిక్కుముడి!

దళపతి విజయ తన సినీ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' ( Jana Nayagan ) .  అయితే గత కొన్ని రోజులుగా సెన్సార్ బోర్డుతో సాగుతున్న వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ డైలమాలో పడేసింది. నెల రోజులగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డుపై వేసిని పిటిషన్ ను ఉపసంహరించుకోంది.  దీంతో ఈ సినిమా థియేటర్లలో విడుదలకు మార్గం సుగమమైంది.

కోర్టులో ఏం జరిగింది?
సెన్సార్ సర్టిఫికేట్ జారీలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు (KVN Productions) వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో  ఈ రోజు ( ఫిబ్రవరి 10, 2026 )  మద్రాస్ హైకోర్టు  ఈ ఉపసంహరణను అధికారికంగా ఆమోదించింది. కేసు కోర్టులో ఉంటే సెన్సార్ బోర్డు తదుపరి చర్యలు తీసుకోలేకపోతుందని గ్రహించిన నిర్మాతలు, చట్టపరమైన పోరాటం కంటే సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భావించారు. దీనివల్ల సెన్సార్ బోర్డు ఇప్పుడు సినిమాను మళ్లీ సమీక్షించి, అవసరమైన కొన్ని చిన్నపాటి కట్స్ సూచించి అతి త్వరలోనే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది.

'జననాయగన్'.. ముహూర్తం ఖరారు?

ఈ సినిమా కేవలం విజయ్ ఆఖరి చిత్రం మాత్రమే కాదు, ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాది వంటిది. విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) తరపున ఫిబ్రవరి 13న సేలంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కూడా అదే సమయంలో వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 19 లేదా 20న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సర్టిఫికేట్ త్వరగా వస్తే, ఈ వారాంతంలోనే సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎన్నికల కోడ్
 ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వస్తే సినిమా ప్రమోషన్లకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ఈలోపే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తెలుగు సూపర్ హిట్ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇందులో విజయ్ మార్క్ రాజకీయ అంశాలను జోడించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది.

విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం వెండితెరకు వీడ్కోలు పలుకుతున్న వేళ, ఈ సినిమా ఆయన అభిమానులకు ఒక భావోద్వేగమైన ముగింపు కానుంది. 'జననాయగన్' అంటే ప్రజల నాయకుడు అని అర్థం, ఇది ఆయన రాజకీయ నినాదానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.