తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలతో పాటు రేసింగ్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు కొంత విరామం ఇచ్చి మరి రేసింగ్ లో పాల్గొంటున్నారు. ప్రముఖ రేసర్ నారాయణ్ కార్తికేయన్ వంటి దిగ్గజ రేసర్లతో కలిసి పోటీ పడుతున్నారు. అయితే అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్ వేదికగా జరుగుతున్న ఏషియన్ లే మాన్స్ సిరీస్ 2026 రేసింగ్ లో ఒక ఆసక్తిరమైన సంఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న అభిమానుల అత్యుత్సాహంపై అజిత్ సీరియస్ అయ్యారు.
"ఇది థియేటర్ కాదు.. ప్లీజ్!"
రేసింగ్ ట్రాక్ వద్ద పిట్ ఏరియా (Pit area) లోకి భారీగా చేరుకున్న అభిమానులు, ఫోటోల కోసం ఎగబడటమే కాకుండా రేసింగ్ కార్లను ముట్టుకోవడం, అరుస్తూ సందడి చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన అజిత్, వెంటనే వారిపై సీరియస్ అయ్యారు. 'ఇది సినిమా థియేటర్ కాదు.. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే టీమ్స్‌కు ఇబ్బంది కలగకూడదు, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అని ఫ్యాన్స్ కు సూచించారు. అజిత్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేసింగ్ అనేది అత్యంత ఏకాగ్రతతో కూడిన క్రీడ అని, అక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఆయన ఫ్యాన్స్‌కు సున్నితంగా హెచ్చరించారు.
నెటిజన్ల మధ్య యుద్ధం
అయితే అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు మద్దతు పలకగా మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి కూడా క్రమశిక్షణ గురించి మాట్లాడటం గర్వకారణమని, విదేశాల్లో మన దేశ ప్రతిష్టను కాపాడటానికి ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి కొంతమంది ఇతర స్టార్ హీరోల అభిమానులు మాత్రం అజిత్ వైఖరిని విమర్శిస్తున్నారు. ఇతర హీరోలు తమ ఫ్యాన్స్‌ను ఆలింగనం చేసుకుంటారని, అజిత్ మాత్రం దూరం పెడుతున్నారని పోలికలు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
రేసింగ్‌పై అజిత్ అంకితభావం
సినిమాలకు విరామం ఇచ్చి మరీ అజిత్ ఈ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 7, -8 తేదీల్లో జరిగిన ఈ ఈవెంట్‌లో అజిత్‌ను చూసేందుకు దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో శివకార్తికేయన్ కూడా అబుదాబి వెళ్లారు. గేమ్ చూసిన అనంతరం అజిత్ తో కలిసి ఫోటోలు దిగారు. అజిత్ తన రేసింగ్ టీమ్ ద్వారా భవిష్యత్ రేసర్లను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. సినిమా గ్లామర్‌ను పక్కన పెట్టి, ఒక ప్రొఫెషనల్ రేసర్‌గా అజిత్ ప్రదర్శిస్తున్న ఈ క్రమశిక్షణ ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోందని ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
#Ajithkumar: Please Behave Yourself.. Theatre Kedayadhunga idhu.. Please..pic.twitter.com/iUWmon49SX
— Laxmi Kanth (@iammoviebuff007) February 10, 2026
