- బోర్డులను తొలగించాలని పోలీసులకు కోర్డు ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో శ్రీసంతోష్ దాబా పేరుతో ఫేక్ దాబాలు కొనసాగుతున్నాయి. వెజిటేరియన్స్ ఎక్కువగా సంతోష్ దాబాలని ఆశ్రయిస్తారు. అయితే సంతోష్ దాబా పేరుతో ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించి అదే పేరుపై వ్యాపారాలు నడుపుతున్నారు.
దీంతో తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఒరిజినల్ యజమాని మనోజ్ కుమార్ సాంక్లా సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. శ్రీ సంతోష్దాబా పేర్లతో కొనసాగుతున్న దాబాల బోర్డులను తొలగించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో గోషామహల్ పోలీసు స్టేషన్ ముందు ఉన్న సంతోష్ దాబా బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో ఆదివారం తొలగించారు.
అక్రమంగా శ్రీ సంతోష్ దాబా పేరుతో పెట్టుకొని, నిజమైన సంతోష్ దాబా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని మనోజ్ కుమార్ తరఫు న్యాయవాది అభిషేక్ అగర్వాల్ తెలిపారు. నగరంలోని హిమాయత్ నగర్, అబిడ్స్, సోమాజిగూడ, అమీర్ పేట, అత్తాపూర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో సంతోష్ దాబా పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు.
కోర్టు ఆదేశాలతో నగరంలో ఉన్న సుమారు 50 దాబాల బోర్డులను తొలిగించనున్నట్లు పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న దాబాల బోర్డులను ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసుల సమక్ష్యంలో తొలగించనున్నారు.
