పేషెంట్ లా వెళ్లి ..ముగ్గురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

పేషెంట్ లా వెళ్లి ..ముగ్గురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఓటీ, నాచారం పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో అక్రమంగా వైద్యం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు మఫ్టీలో రోగులుగా ఆయా కేంద్రాలకు వెళ్లి అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య అర్హతలు, అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండానే చికిత్స అందిస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మల్లాపూర్‌లోని నవోదయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు మొహద్ ఇస్మాయిల్, రుధిక్షా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో వైద్య సేవలు అందిస్తున్న గంగుల సాయి తేజ, వెంకటేశ్వర ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో సేవలందిస్తున్న పుల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి స్టెతస్కోపులు, బీపీ యంత్రాలు, థర్మామీటర్లు, ప్రిస్క్రిప్షన్ బుక్, సిరంజీలు, వివిధ రకాల ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అధికారిక వైద్య అర్హతలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన ముగ్గురిపై సంబంధిత BNS సెక్షన్లతో పాటు Indian Medical Council Act కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని, అనుమతులు లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవద్దని పోలీసులు సూచించారు.