నకిలీ జీవోలు.. ప్రభుత్వ భూమికి ఎసరు.. హైకోర్టులో తప్పుడు కేసులు.. డిస్మిస్

నకిలీ జీవోలు.. ప్రభుత్వ భూమికి ఎసరు.. హైకోర్టులో తప్పుడు  కేసులు.. డిస్మిస్
  • సెర్చ్ వారెంట్లతో నిందితుల ఇండ్లల్లో పోలీసులు సోదాలు

గండిపేట, వెలుగు: నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించిన నిందితుల్లో ఇండ్లల్లో నార్సింగి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గండిపేట సర్వే నంబర్‌ 18లో తమకు ప్రభుత్వ భూమి కేటాయించారంటూ ఫేక్‌ జీవోలను తయారు చేసి, హైకోర్టులో సైతం తప్పుడు కేసులు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణుగోపాల్‌గౌడ్‌, నిమ్మల బాలస్వామిగౌడ్‌, నిమ్మల రాజేశ్​గౌడ్‌లపై గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఈనెల 23న ఫిర్యాదు చేశారు. 

దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల హైకోర్టులో కేసు డిస్మిస్ కావడంతో ఈ ఫేక్‌ జీవోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి సెర్చి వారెంట్లు తీసుకున్న నార్సింగి పోలీసులు.. గురువారం గండిపేటలోని నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. గండిపేట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, కంప్యూటర్‌ డేటా, నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.