
- నలుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
- యూఎస్‌లో ఉన్న వారి బంధువులుగా క్రియేషన్
- విజిటింగ్ వీసాల కోసం ఫేక్ డాక్యుమెంట్స్
- బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫేక్ ఐడీ కార్డులతో స్కెచ్
- యూఎస్ కాన్సులేట్ ఇంటర్వ్యూల్లో చీటింగ్
- ఒక్కో వీసాకు రూ.5లక్షలు వసూలు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న నకిలీ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ముఠా గుట్టురట్టైంది. ఎల్బీనగర్ ఎస్‌వోటీ, నేరెడ్‌మెట్ పోలీసులు బుధవారం జాయింట్ ఆపరేషన్ చేసి ఇద్దరు వీసా ఏజెంట్స్, క్లయింట్, ఫైనాన్సియర్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 16 ఫేక్ ఐడీ కార్డులు, 5 పాస్ పోర్ట్‌లు, 279 వీసా క్లయింట్స్‌కి చెందిన చెక్ బుక్స్, ఫేక్ ఇన్విటేషన్ లెటర్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్‌లోని రూ.7.2 లక్షల క్యాష్‌ను ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను బుధవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
వీసా ప్రాసెసింగ్‌లో ఏజెంట్స్ నకిలీ దందా
సికింద్రాబాద్ మచ్చబొల్లారం స్రవంతి నగర్‌కు చెందిన గార్లపాటి వెంకట దుర్గా నాగేశ్వర సిద్ధార్థ అలియాస్ విల్సన్ చౌదరి(38) వీసా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత ఆరేండ్లుగా సికింద్రాబాద్‌లో సెయింట్ ఆంథోనీస్ ఇమ్మిగ్రేషన్స్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఓల్డ్ అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన నాతల ప్రభాకర్ రావు(48) కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఇండియా నుంచి అమెరికా సహా విదేశాలకు వెళ్లే వారికి విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ చేసేవాళ్లు. ఇందుకోసం ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేవారు. ఇందుకు గాను ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షలు చార్జ్ చేసేవారు. అడ్వాన్స్‌గా రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం యూఎస్‌ఏలో నివసిస్తున్న ఇండియాకు చెందిన భార్యభర్తల ఒరిజినల్ స్పాన్సర్ లెటర్స్‌ను సేకరించి వాటిని ఎడిట్ చేసేవారు. వాటిలో తమ వద్దకు వచ్చే క్లయింట్స్ ను వారి బంధువులుగా స్పాన్సర్ చేస్తున్నట్లు లెటర్స్ క్రియేట్ చేసేవారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నకిలీ ఐడీ కార్డ్‌లను తయారు చేశారు. ఇంటర్వ్యూ సమయంలో యూఎస్ కాన్సులేట్ అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు క్లయింట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇలా వీసా వచ్చిన వారి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు.
60 మందిలో 10 మందికి వీసా
ఇలా ప్రతి నెలా సుమారు 60 మందిని ఇంటర్వ్యూకు పంపించేవారు. వీరిలో 10 మంది క్వాలిఫై అయ్యేవారు. వీసా వచ్చిన క్లయింట్స్‌కి ప్రభుత్వ ఉద్యోగి ఫేక్ ఐడీ కార్డ్, ఫేక్ స్పాన్సరింగ్ లెటర్, బ్యాంక్ బ్యాలెన్స్ చూపేవారు. ఇందుకోసం ఫైనాన్సియర్ జి నాగరాజు(33) పేరుతో నేరెడ్‌మెట్ క్రాస్ రోడ్స్‌లోని ‘‘ది జాగృతి కో ఆపరేటివ్ యూనియన్ బ్యాంక్’’లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇలా క్లయింట్స్ కు దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్స్ చేశారు. విజిటింగ్ వీసాలపై విదేశాలకు వెళ్లి బంధువులను కలిసి తిరిగి వస్తారని యూఎస్ కాన్సులేట్ అధికారులను నమ్మించేలా ప్లాన్ చేసేవారు.
ఇలా దొరికారు
హైదరాబాద్ నుంచి జారీ అవుతున్న యూఎస్ వీసాలపై కాన్సులేట్ అధికారులకు అనుమానం వచ్చింది. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు. టీఎస్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా యూఎస్ కాన్సులేట్‌కు వచ్చిన నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామానికి చెందిన జక్కుల నాగేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు వెంకట దుర్గా నాగేశ్వర సిద్ధార్థ, ప్రభాకర్ రావు, నాగరాజులను అరెస్ట్ చేశారు. వీరి కన్సెల్టెన్సీల ద్వారా యూఎస్ సహా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.