మాయలోడు : ఉద్యోగాల పేరుతో రూ. 9లక్షలు మోసం

మాయలోడు : ఉద్యోగాల పేరుతో రూ. 9లక్షలు మోసం

మలక్ పేట, వెలుగు: ఇన్ కం టాక్స్ ఆఫీసర్ నని చెప్పి మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని చాదర్ ఘాట్ పోలీసులు చెప్పారు. తాను ఇన్ కంటాక్స్ ఆఫీసర్ నని, అకౌంటెంట్ జనరల్ గా చెప్పుకుంటు సిరాజ్ అహ్మద్ (49) జనాల నుంచి డబ్బులు దండు కున్నాడన్నారు. జీఎస్టీ కమిషనర్ తనకింద పనిచేస్తాడని, తాను ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో మెహిదీపట్నంలో ఉంటూ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు ఆపి ఎస్ వోటీ పోలీస్ ల పేరుతో, సీబీఐ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని వాహనదారుల నుండి 9 లక్షలు కాజేసినట్టు వివరించారు. మూడు నెలలు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన మకాం మలక్ పేట కు మార్చాడన్నారు.

ఎం.కామ్ చదివిన సిరాజ్ 1996-నుంచి 2002 వరకు దుబాయ్, 2006 నుంచి -2014వరకు బెహ్రీన్ వెళ్లి అక్కడ ఉండలేక జల్సాలకు అలవాటుపడి ఇలా నకిలీ అవతారలు వేస్తూ జనాలను మోసం చేస్తున్నట్టు చెప్పారు. 2018 డిసెంబర్ లో చాదర్ ఘాట్ లోని సుధాకర్ ట్రావెల్ ఏజెన్సీ నుండి ఇన్నోవా కారు రెంట్ కు తీసుకొని, కారుపై ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ తో సైరన్ ఏర్పాటు చేసి, డ్రెస్ కోడ్ లో డ్రైవర్ ను ఏర్పాటుచేసుకుని జీఎస్టీ కమిషనర్ తన పరిధిలోని పనిచేస్తారని నమ్మించి అత్తపూర్, ఉప్పర్పల్లికి చెందిన యాసిన్ బేగం నుండి లక్ష రూపాయల వసూలు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఇతని పై కేసులున్నాయన్నారు. ఈ నెల 3 న యాసీన్ బేగం ఫిర్యాదు మేరకు సిరాజ్ ను అరెస్టు చేశామన్నారు. నిందితుడి నుంచి ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.