ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు కట్టించుకుని..

ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు కట్టించుకుని..

హైదరాబాద్: విదేశీ ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగుచూసింది. హఫీజ్‌పేట్‌లో సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఈ మోసగాళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేశారు. ఈజిప్ట్ వరకు తీసుకెళ్లి ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు బాధితులను అర్థాంతరంగా మధ్యలోనే వదిలేశారు. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులు సొంత ఖర్చులతో తిరిగొచ్చారు.

మొత్తం 90 మంది నిరుద్యోగులు డబ్బులు కట్టి కూడా ఉద్యోగం లేక దేశం కాని దేశంలో నానా తిప్పలు పడ్డామని.. సొంత డబ్బులతో తిరిగి వచ్చామని వాపోయారు. ఇదేంటని నిలదీయడానికి కన్సల్టెన్సీ ఆఫీస్కు వెళితే మూసేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ పరారీలో ఉన్నారు. ఆఫీస్ మూతపడడంతో బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విదేశాల్లో ఉద్యోగం.. నెలకు లక్షల్లో జీతం.. అంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించి, సుమారు 150 మంది నిరుద్యోగుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన ‘శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్’ సంస్థ బాగోతం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పది నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు గచ్చిబౌలిలో ఆందోళనకు దిగారు. న్యాయం చేయాల్సిందిపోయి చులకనగా మాట్లాడుతున్నారని వాపోయారు.

గచ్చిబౌలిలోని శ్రీ ఇమ్మిగ్రేషన్ కంపెనీ నిర్వాహకులు శ్రీ కిరణ్, నివేదిత కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ వంటి దేశాల్లో సాఫ్ట్​వేర్, సూపర్ మార్కెట్, వేర్​హౌజ్ సూపర్ వైజర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. అరుణ్ కుమార్​ అనే వ్యక్తి సంస్థ ప్రతినిధిగా బాధితులతో మాట్లాడి, డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు రవి అనే యువకుడు సోషల్​మీడియాలో ప్రకటన చూసి, ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ఈ సంస్థను సంప్రదించగా, నిందితుడు అరుణ్ కుమార్ అతడిని నమ్మించి రూ. 11 లక్షలు వసూలు చేశాడు. 

డబ్బులు కట్టిన తర్వాత వీసా వచ్చిందని నమ్మించడానికి ఒక పత్రాన్ని రవికి పంపారు. అయితే, ఆ డాక్యుమెంట్​లో వీసా గ్రాంట్ నంబర్, ట్రావెల్ డాక్యుమెంట్ నంబర్, అప్లికేషన్ ఐడీలను నిందితులు ఉద్దేశపూర్వకంగా కనిపించకుండా హైడ్ చేశారు. రవి దీనిపై నిలదీయగా.. మిగిలిన డబ్బులు కడితేనే పూర్తి వివరాలు ఉన్న వీసా కాపీ ఇస్తామని నమ్మబలికారు. 

రవి మరిన్ని డబ్బులు కట్టగా, తీరా అది నకిలీ వీసా అని తేలింది. కూకట్​పల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ప్రమోద్ కూడా ఇలాగే రూ. 13 లక్షలు చెల్లించి ఫేక్ వీసాతో మోసపోయాడు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 80 వేల నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 150 మంది నుంచి రూ. 10 కోట్ల మేర దోచుకుని మోసం చేశారు.