వ్యాక్సిన్​ వేయకున్నా వేసినట్లు మెసేజ్​లు!

వ్యాక్సిన్​ వేయకున్నా వేసినట్లు మెసేజ్​లు!
  • కేటీఆర్​ ఇలాకాలో వంద శాతం టార్గెట్​ కోసం వైద్యసిబ్బంది అడ్డదారులు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మంత్రి కేటీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్​ పూర్తి చేశామని చెప్పుకునేందుకే  వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తికి రెండో డోస్​వేసినట్లు సెల్​ఫోన్​మేసేజ్​పంపించి అభాసుపాలయ్యారు. విషయం కాస్తా పత్రికలకు ఎక్కడం, ఉన్నతాధికారులు మొట్టికాయలు వేయడంతో  చేసేదేం లేక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆగమేఘాలపై జిల్లా కలెక్టర్​ఎంక్వైరీకి ఆదేశించడంతో ఇద్దరు ఏఏన్​ఎంలను సస్పెండ్​ చేస్తూ.. సంబంధిత వైద్యాధికారికి మోమో జారీ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనలు మరికొన్ని వెలుగుచూస్తుండడంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
వంద శాతం పూర్తి చేశామని చెప్పుకునేందుకు..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు మండల వైద్యాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది ఇళ్ల వద్దకు, పొలాల కాడికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం తగ్గడంతో సెకండ్​ డోస్​వేసుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్​చూపడం లేదు.​ ఈ క్రమంలో వ్యాక్సిన్​ తీసుకోనివారికీ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యసిబ్బంది తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 100 శాతం వ్యాక్సినేషన్​పూర్తి చేసినట్లు చూపించాలనే ఆతృతలో ఇలా చేస్తున్నారా లేదంటే  ఆయా వ్యక్తులకు వేసినట్లు చూపుతున్న వ్యాక్సిన్​ను ప్రైవేట్ కు తరలిస్తున్నారా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.  ఈ క్రమంలో జిల్లా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యులపై చర్యలు 
చనిపోయిన వ్యక్తి కి రెండో డోస్​ఇచ్చినట్లు ఆన్​లైన్​లో నమోదు చేయడం, వాక్సిన్​ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపడంపై జిల్లా కలెక్టర్​అనురాగ్​జయంతి స్పందించారు. విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్​రావ్​ను ఆదేశించారు. దీంతో ఎంక్వైరీ చేసిన జిల్లా వైద్యాధికారి సుమన్​రావ్​ కోనరావుపేట మండల పీహెచ్​సీలో  పని చేస్తున్న ఏఎన్ఎంలు సంపూర్ణను ఇప్పటికే సస్పెండ్​ చేశారు. మరో ఏఎన్ఎం కవితను సస్పెండ్​ చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. కోనరావుపేట మండల వైద్యాధికారికి మెమో జారీ చేశారు.