బక్రీద్ సంతల్లో ఫేక్ పేమెంట్ లు... జీవాల వ్యాపారులే టార్గెట్.. నకిలీ పేమెంట్ యాప్ లతో బురిడీ

బక్రీద్ సంతల్లో ఫేక్ పేమెంట్ లు... జీవాల వ్యాపారులే టార్గెట్.. నకిలీ పేమెంట్ యాప్ లతో బురిడీ
  • ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే స్క్రీన్ చూపించి నకిలీ ట్రాన్సాక్షన్ డ్రామా
  • చెల్లింపుల విషయంలో వ్యాపారులు జాగ్రత్త: సీపీ

బషీర్​బాగ్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెలు, మేకల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. నగరంలోని పలు బక్రీద్ సంతల్లో కొనుగోలుదారుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు ఫేక్ ఫోన్​పే, నకిలీ పేమెంట్ యాప్​ల ద్వారా వ్యాపారులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. 

నకిలీ మొబైల్ అప్లికేషన్లలో నగదు పంపినట్లుగా చూపిస్తూ, వ్యాపారుల ఫోన్​కు డబ్బు జమ కాకపోయినా “పేమెంట్ సక్సెస్” స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్తున్నారని చెప్పారు. సంతల్లో ఉండే హడావుడిని ఆసరాగా చేసుకుని, బ్యాంక్ ఖాతా తనిఖీ చేయకముందే వ్యాపారులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. 

కంచన్​బాగ్​లో రూ.68 వేలు..రాజేంద్రనగర్​లో రూ.48 వేల మోసం

తాజాగా కాంచన్​బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్​లపై వచ్చి, ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ.68 వేల చెల్లింపు చేసినట్లు నకిలీ యాప్​లో చూపించి జీవాలను తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే రాజేంద్రనగర్ ప్రాంతంలోనూ నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన గొర్రెలను ఇదే తరహాలో మోసం చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

ఈ నేపథ్యంలో విక్రయదారులు కేవలం కొనుగోలుదారుడి మొబైల్​లో కనిపించే స్క్రీన్​షాట్​లను నమ్మవద్దని.. నగదు నిజంగా తమ ఖాతాలో జమైందో లేదో బ్యాంక్ అధికారిక ఎస్​ఎంఎస్ లేదా స్వంత బ్యాంకింగ్ యాప్ ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే గొర్రెలు, మేకలను అప్పగించాలని సీపీ సూచించారు. 

పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే సందర్భాల్లో సాధ్యమైనంత వరకు నగదు రూపంలోనే చెల్లింపులు స్వీకరించడం మంచిదన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.