- హైదరాబాద్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న సీఐడీ
హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ స్కామ్ కేసులో సీఐడీ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. గత ఏడాదిన్నర కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఫాల్కన్ గ్రూప్ సీఓఓ వికాస్ కుమార్ సఖారే (40)ను బుధవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ ద్వారా డిపాజిటర్లను ఈ సంస్థ భారీగా మోసం చేసినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.
తక్కువ సమయంలోనే అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తామంటూ నమ్మించి, సుమారు 7,056 మంది డిపాజిటర్ల నుండి ఏకంగా రూ. 4,215 కోట్లు వసూలు చేశారు. వీటిలో ‘క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అనుబంధ సంస్థ ద్వారా 4,065 మంది బాధితులను రూ. 792 కోట్ల మేర ముంచినట్లు విచారణలో తేలింది. బాధితులు ఫిర్యాదులు ఇవ్వడంతో సైబరాబాద్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
ఆయా కేసుల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ దీప్ కుమార్, ఫాల్కన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ సహా పలువురిని ఇప్పటికే సీఐడీ అరెస్ట్ చేసింది.
