
- చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్రూప్ చేసిన స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సంస్థ సీఈవో యోగేంద్ర సింగ్, ఎండీ అమర్‌దీప్ కుమార్‌ను అరెస్ట్ చేసిన రాష్ట్ర సీఐడీ.. తాజాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) ఆర్యన్ సింగ్‌ను అరెస్టు చేసింది. అతణ్ని శుక్రవారం పంజాబ్‌లోని బఠిండాలో అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చింది. ఆదివారం జడ్జి ముందు హాజరుపరిచి చంచల్‌గూడ జైలులో రిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐడీ చీఫ్ చారుసిన్హా ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకు నలుగురు అరెస్టు..
దుబాయ్‌కి పారిపోయిన ఫాల్కన్ గ్రూప్ సీఈవో యోగేంద్ర సింగ్, ఎండీ అమర్‌దీప్ కుమార్, అతని సోదరుడు సందీప్ కుమార్‌ను మేలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు డిపాజిట్లుగా సేకరించిన సొమ్ములో రూ.1.62 కోట్లు ఆర్యన్ సింగ్ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలకంగా వ్యవహరించినట్టు ఆధారాలు సేకరించారు.
అయితే సైబరాబాద్‌లో కేసు నమోదైన వెంటనే ఆర్యన్ సింగ్ పారిపోయాడు. మొదట నాందేడ్‌కు వెళ్లాడు. అక్కడ కొంత కాలం షెల్టర్ తీసుకున్నాడు. అనంతరం పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లి, స్థానిక గురుద్వారాలో షెల్టర్ తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు.. అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.
ఇదీ కేసు..
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీటో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చింది. మల్టీ నేషనల్ కంపెనీ ముసుగులో టెలీకాలర్స్‌ను నియమించింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలతో వ్యాపారం నిర్వహిస్తున్నామని, తమ సంస్థ ద్వారా పెట్టుబడులు పెడితే అత్యధిక వడ్డీతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది.
ఇలా దాదాపు 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేసింది. ఇందులో 4,065 మందికి చెల్లించాల్సిన రూ.792 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు కేసులు నమోదు చేశారు. వీటిని సీఐడీకి బదిలీ చేశారు.