మళ్లీ అవే కుట్రలు? .. మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం

మళ్లీ అవే కుట్రలు? .. మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
  • కర్నాటక మహర్షి వాల్మీకి కార్పొరేషన్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో 
  • వివేక్  పేరును ఈడీ చేర్చిందంటూ తప్పుడు వార్తలు
  • ఏడాది క్రితం  ‘వీ6 బిజినెస్ సొల్యూషన్స్​’ను 
  • ‘వీ6 వెలుగు’కు అంటగడుతూ కేటీఆర్​ ఆరోపణలు
  • వివేక్ ​వెంకటస్వామి గట్టి కౌంటర్​ ఇవ్వడంతో అప్పట్లో సైలెన్స్​
  • ప్రారంభంలో వివేక్​కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుతంత్రం
  • తీరా పదవి వచ్చాక ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నం 

హైదరాబాద్​, వెలుగు: ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్.. వారి  సోషల్ మీడియా వింగ్ ద్వారా మరోసారి బురదజల్లే కార్యక్రమానికి తెరతీసింది. కర్నాటకలోని మహర్షి వాల్మీకి కార్పొరేషన్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిందని, చార్జిషీట్​లో  మంత్రి వివేక్ వెంకటస్వామి పేరు కూడా చేర్చిందని, త్వరలోనే ఆయన నివాసాల్లోనూ దాడులు జరుగుతాయంటూ తప్పుడు కథనాలను సృష్టించి వైరల్​ చేస్తున్నది. 

ఇదంతా మంత్రి వివేక్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రగా కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొదట్లో వివేక్​ కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుతంత్రాలు చేయగా.. తీరా మంత్రి పదవి వచ్చాక ప్రజల్లో పలుచన చేసే కుట్రలకు పాల్పడుతున్నారు. 

 మరోసారి పాత అబద్ధాలు ప్రచారంలోకి..

కర్నాటకలో నిరుడు వెలుగు చూసిన మహర్షి వాల్మీకి కార్పొరేషన్ స్కాం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి వివేక్ పేరును ఈడీ చేర్చిందంటూ బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు మరోసారి దుష్ప్రచారం చేస్తు న్నాయి. వాస్తవానికి, ఈ స్కామ్‌‌‌‌తో వివేక్ వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదని, ఈడీ కూడా ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సరిగ్గా ఏడాది కింద, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 

కర్నాటక వాల్మీకి స్కామ్‌‌‌‌లో భాగంగా రాష్ట్రంలోని ‘వీ6 బిజినెస్’ ఖాతాకు రూ.4.5 కోట్లు బదిలీ అయ్యాయని, దీనికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వీ6 న్యూస్’ చానెల్​కు సంబంధం ఉన్నట్లుగా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ‘వీ6’ అనే పేరు ఉంది కాబట్టి వివేక్ వెంకటస్వామి ప్రమేయం ఉందన్నట్లుగా కేటీఆర్ పరోక్షంగా ఆరోపించారు.

వివేక్ కౌంటర్​ ఇవ్వడంతో..

నిజానికి ‘వీ6’ న్యూస్ చానల్‌‌‌‌కు అనుబంధంగాగానీ, వివేక్ సంస్థల్లోగానీ ‘వీ6 బిజినెస్’ అనే పేరుతో సంస్థ లేనేలేదు. ఇదే విషయాన్ని వివేక్ వెంకటస్వామి ప్రెస్​మీట్​ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ చెప్తున్న ‘వీ6 బిజినెస్ సొల్యూషన్స్’ సంస్థకు బెంగళూరులోని హంపీ నగర్‌‌‌‌లో ఆఫీసు ఉందని, ‘వీ6 బిజినెస్ సొల్యూషన్స్’ తో వీ6, వెలుగు మీడియాకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే వివేక్ స్పష్టం చేశారు. 

ఈ వివరాలన్నీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దొరుకుతాయని, కానీ కావాలనే కేటీఆర్ బట్ట కాల్చి మీదేస్తున్నారని, తన బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై, తమ సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని ఫైర్​ అయ్యారు. తన సంస్థలన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని క్లారిటీ ఇచ్చిన ఆయన, తనపై చేసిన ఆరోపణలు కేటీఆర్ నిరూపిస్తే.. తాను దేనికైనా సిద్ధమేనని సవాల్​ విసిరారు. వివేక్ గట్టిగా కౌంటర్​ ఇవ్వడంతో అప్పట్లో సైలెన్స్​ అయిన బీఆర్ఎస్​ సోషల్​ మీడియా విభాగాలు.. తాజాగా ఆయనకు మంత్రి పదవి రావడంతో మరోసారి విషం చిమ్ముతున్నాయి.

మొదటి నుంచీ ఇదే తీరు..   

వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయ డం ఇది మొదటిసారి కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల ఫలితాలు వెలువడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకుని కుట్ర లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, వివేక్​ వెంకటస్వామికి మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తెరవెనుక ప్రయత్నాలు చేశాయని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

పదే పదే వివిధ రకా ల ఆరోపణలు చేస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి, మంత్రి పదవి చేపట్టిన వివేక్ వెంకటస్వామి.. ఇప్పుడు ప్రజలకు మరింత దగ్గరవుతుండటంతో బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నదని స్పష్టమవుతున్నది. 

ఫాంహౌస్​ పేరిట తప్పుడు ప్రచారం

బీఆర్ఎస్ అధికారిక పత్రికలో వివేక్ ఫాం హౌస్ పైనా తప్పుడు ప్రచారం చేయించారు. ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్ జోన్‌‌‌‌లో వివేక్ ఫాంహౌస్ కట్టినట్టు అసత్యాలు రాశారు. వాస్తవానికి ఏ చెరువుకైనా 30 మీటర్ల ఎఫ్‌‌‌‌టీఎల్, ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటాయని..అవన్నీ దాటిన తర్వాతే తన ఫామ్‌‌‌‌హౌస్​ నిర్మించామని, సదరు పత్రికలో చూపించిన ఫాంహౌస్ తనది కాదని వివేక్ ప్రెస్​మీట్​పెట్టి మరీ చెప్పినా ఆరోపణలు ఆపలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై తనపై ఈడీ దాడులు చేయించాయని వివేక్​ వెంకట​స్వామి ఆరోపించారు. 

విజయన్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా 8 కోట్ల రూపాయలు పట్టుకున్నారని ప్రచారం చేశార ని మండిపడ్డారు. నిజాలు నిగ్గు తేల్చడంతో ఈడీ అధికారులు ఆ డబ్బులను తిరిగి ఇచ్చేశారు. దీంతో అది కూడా వివేక్​ చెప్పినట్టు బీఆర్ఎస్ దుష్ప్రచారమే అని రుజు వైంది. ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి లాంటి బలమైన, ప్రజాదరణ కలిగిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అయితే, ఇలాంటి కుట్రలు, దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరని, వాస్తవాలను గ్రహిస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

‘వీ6 వెలుగు’పైనా విషం

రాష్ట్రంలో అత్యధిక జనాదరణ ఉన్న ‘వీ6 వెలుగు’ను నైతికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని బీఆర్ఎస్ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. పదేండ్లపాటు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభించిన వీ6 చానల్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. అస్థిత్వ పోరాటంతోపాటు తెలంగాణ కట్టు, బొట్టు, భాష, యాసలకు పెద్దపీట వేసింది. తెలంగాణ వచ్చాక ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన సాగుతున్నప్పుడు ఒక బాధ్యత గల మీడియా సంస్థగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపింది. కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతిని బయటపెట్టింది. దీనిపై కక్ష గట్టిన బీఆర్ఎస్ పెద్దలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీ6 వెలుగు ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేయగా, తాజాగా నైతికంగా దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారు. వీ6 వెలుగు సంస్థలో కీలకంగా ఉన్న తన మనిషి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సంస్థలో వాటా అడుగుతున్నారని, దీనిపై గొడవలు జరుగుతున్నాయని ఇటీవల బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఇది కూడా వాస్తవదూరమైన ప్రచారమే అని తేలడంతో సైలెంట్​ అయ్యారు.