అమెరికాలో ‘దోశె మ్యాన్‌‌’

అమెరికాలో ‘దోశె మ్యాన్‌‌’

దక్షిణ భారత దేశంలో దోశె ఎంతో ఫేమస్‌‌. అలానే కందస్వామి తిరుకుమార్‌‌ న్యూయార్క్‌‌లో అంత ఫేమస్‌‌! అదెలాగంటే.. ఈ దోశెతోనే. వాషింగ్టన్‌‌ స్వ్కేర్‌‌ పార్క్‌‌ దగ్గర 18 ఏళ్లుగా దోశెలమ్ముతూ ఆ మహానగరంలో మంచి పేరు సంపాదించుకున్నాడాయన. ఆయన దోశెలను ఎంత టేస్టీగా చేస్తాడో చెప్పాలంటే న్యూయార్క్‌‌ ప్రజలే చెప్పాలి. ఆ నగర ప్రజలు ఆయన్ని ‘తిరు’ అని అభిమానంతో పిలుచుకుంటారు. ఆయన దోశె టేస్ట్‌‌ ఏంటో ఆ అభిమానమే చెబుతోంది.

శ్రీలంకకు చెందిన తిరు కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాకు వలసపోయిండు. అక్కడ ఉన్న రెస్టారెంట్లలో పనివాడిగా చేరిండు. భారతీయ వంటకాలను తయారు చేయడం చిన్నగా నేర్చుకున్నడు. ఈ అనుభవంతో జీవనోపాధి కోసం ఒక ఫుడ్‌‌ కార్ట్‌‌ని ప్రారంభించాలనుకున్నడు. అమెరికాలో భారతీయులు ఎక్కువగానే ఉంటారు ఇది తన ఉపాధికి బాగానే గిట్టుబాటు అవుతుందనుకున్నారు. దక్షిణ భారతీయ వంటకాలైన ప్లెయిన్‌‌ దోశె, ఉప్మా దోశె, ఆనియన్‌‌ దోశె, బట్టర్‌‌ దోశె, ఊతప్పం, ఇడ్లీ లంచ్‌‌, జాఫ్నా లంచ్‌‌, రోటీ, కూరలు, సింగపూర్‌‌ నూడిల్స్‌‌, సమోసా మొదలైన వంటకాలకు ఆయన ఫుడ్‌‌ కార్ట్‌‌ చాలా ఫేమస్‌‌. జనం కోరే రుచులను అందించే తిరు కొన్ని ప్రయోగాలూ చేసిండు. అలా ఒక దోశెని తయారు చేసి, దానికి ‘పాండిచ్చేరి దోశె’ అనే పేరు పెట్టిండు.

న్యూయార్క్‌‌ యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడూ ఓ 20 మంది ఈ కార్ట్‌‌ దగ్గర కూర్చుని ఇండియన్‌‌ వంటకాల్ని ఆరగిస్తూనే ఉంటారు. న్యూయార్క్‌‌ యూనివర్సిటీ విద్యార్థులు కనీసం 40 నిమిషాల పాటు ఇక్కడ కాలక్షేపం చేస్తారట. ఇంత గిరాకీ ఉన్న తిరు ఏ రోజైనా తాను రాకపోతే ఆ విషయాన్ని ముందుగానే ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేస్తాడు. ఉదయాన్నే ఈ విషయాన్ని తన అభిమాన కస్టమర్లకు చెప్పడం వల్ల ఆయన కోసం ఎవరూ ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. టూరిస్టులు, విద్యార్థులే కాకుండా స్థానికంగానూ తిరూకి అభిమానులున్నారు. పదిహేనేళ్ల నుంచి ఆయనకు రెగ్యులర్‌‌గా వచ్చే కస్టమర్లున్నారు. ‘దోశె మ్యాన్‌‌’గా న్యూయార్క్‌‌ ప్రజలు ప్రేమతో పిలుచుకునే తిరు సక్సెస్‌‌ స్టోరీని ప్రచురించని మ్యాగజైన్‌‌ లేదు.