కొలువు ఉంటదో, పోతదో!

కొలువు ఉంటదో, పోతదో!

క్షణ క్షణం భయంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు
ఈ నెల జీతాలు రాక పూట గడవని పరిస్థితులు

నిన్నా మొన్నటి వరకు ఆర్టీసీని ప్రైవేట్‌‌ పరం చేస్తారనే భయం.. ఇప్పుడు అసలు జాబ్‌‌ ఉంటుందో లేదోనన్న ఆందోళన. ఆర్టీసీని కాపాడుకోవాలనే లక్ష్యంతో సమ్మెలోకి దిగిన 50 వేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాలు సీఎం ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వేతనాలు విడుదల చేయకపోవడంతో దసరా పండుగ కూడా జరుపుకోలేకపోయాయి. కార్మికులవన్నీ పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలే. ఒక్క నెల జీతం ఆలస్యమైతే అల్లాడిపోయే ఫ్యామిలీలే. తాజా పరిస్థితుల్లో కొందరు ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ‘వెలుగు’ పలకరించగా, తమ కష్టాలను ఏకరువు పెట్టారు.  గడప గడపనా కన్నీటి గాథలే వినిపించారు.  – వెలుగు, నెట్​వర్క్​

ఇద్దరు పిల్లలకు అనారోగ్యం

అన్ని కటింగ్స్​ పోను చేతికి వచ్చేది రూ.15వేలు. ఇద్దరు ఆడపిల్లలకు సికిల్​సెల్​. వారిద్దరికీ నెలనెలా మందులకు రూ. 5వేలు ఖర్చవుతోంది. ఇంటి అద్దెకు రూ. 4వేలు పోతోంది. కొంతకాలంగా నాకు ఆరోగ్యం బాగాలేదు. నెలకు రూ. 3వేలకు పైగానే ఖర్చు. దీనికి తోడు స్కూల్​ ఫీజులు, పండగలు, పబ్బాలు. సెప్టెంబర్​ నెల జీతం ఇంకా ఇయ్యలే. ఇల్లు, హాస్పిటల్​ ఖర్చులకు రూ. 12 వేలు అప్పు చేసిన. పని చేసినా నెలకు జీతం ఇయ్యకపోతే ఎట్ల బతకాలె. ఎమ్మెల్యేలకు అడగకుండానే జీతాలు పెంచిండ్రు. మేమేం పాపం చేసినం. సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడం తప్పా?

– చైతన్య, మహిళా కండక్టర్​, భద్రాద్రికొత్తగూడెం జిల్లా

ఆమెకు క్యాన్సర్..   ట్రీట్మెంట్ చేయట్లే

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల లక్ష్మణ్​ 1992లో ఆర్టీసీలో మెకానిక్​గా  చేరాడు. పుట్టుకతోనే  వికలాంగుడైన లక్ష్మణ్​కు భార్య విజయ, కూతురు వెన్నెల, కొడుకు సునీల్​ ఉన్నారు.  విజయ 15 ఏళ్ల క్రితం క్యాన్సర్​బారిన పడింది.  ఎలాగోలా కష్టపడి కూతురు వెన్నెల  పెళ్లి చేసి, కొడుకును హైదరాబాద్​లో చదివిస్తున్నాడు. ఉద్యోగంతోపాటు, ఇంట్లో భార్యకు సపర్యలు చేస్తూ బతుకు బండిని భారంగా లాగిస్తున్నాడు.  సమ్మె  నేపథ్యంలో  ఆర్టీసీ ఆసుపత్రుల్లో కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు చికిత్స నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో లక్ష్మణ్​ తన భార్య విజయకు చికిత్స అందించలేక బోరున విలపిస్తున్నాడు.  ప్రతి నెలా క్యాన్సర్​ చికిత్స కోసం సుమారు రూ.10 వేల పైగా ఖర్చు అవుతుందని, ఉద్యోగం కూడా పోతే ఎట్ల బతకాలని విలపిస్తున్నాడు.

పండుగ జేసుకోలే..

ఆర్టీసోళ్లకు సర్కారు ఈనెల జీతం ఇయ్యలే.  మా ఇండ్లళ్ల పండగ సంబురం లేకుంట జేసిండు కేసీఆర్. పిల్లలకు బట్టలు కొనలే. మిగిలిన పిల్లలు కొత్త బట్టలు ఏస్కుంటే చూసి కండ్లళ్ల నీళ్లు తెచ్చుకున్నరు. తెలంగాణ ఉద్యమం టైంల కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తనన్నడు. ఇదేనా బంగారు తెలంగాణ? ఇంటికో ఉద్యోగం అన్నడు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తుండు. 50 వేలు జీతం ఇస్తున్న అంటుండు. ఎవరికి ఇస్తున్నవ్ సార్​.. నా భర్త 21 ఏండ్ల నుంచి డ్రైవర్​గ చేస్తుండు. ఇప్పటికి కటింగులు పోను రూ.15 వేల జీతమే వస్తంది.  దీంతో కుటుంబం ఎట్ల బతకాలే.
– బొడికుంట పద్మ,
డ్రైవర్ శంకరయ్య భార్య, మంచిర్యాల

బీపీ, షుగర్ ఎక్కువైనయ్

నాకు బీపీ, షుగర్ వ్యాధులున్నయి. అనారోగ్యంతోనే డ్యూటీ చేస్తున్న. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేసిన్రు.  అసలు  మేము చేసిన తప్పేందో సీఎం చెప్పాలె. మేము ఆర్టీసీని కాపాడుమని కోరుతున్నం తప్ప నాశనం చేయిమని కాదు.  వారం నుంచి నాకు టెన్షన్​తో బీపీ, షుగర్ ఎక్కువైంది.   జీతం రాక కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
– యు.సరళాదేవి, కండక్టర్, హన్మకొండ డిపో

సీఎం మాటలు బాధ పెడుతన్నాయి

20ఏళ్ల సంది మా భర్త ఆర్టీసీల  పనిచేస్తున్నడు. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులపై ఇంత కఠినంగా, నిరంకుశంగా  ప్రవర్తించలే. కానీ సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో ఏకపక్షంగా పోతండు. కార్మికులకు సమ్మె చేసుకొనే  నైతిక హక్కు లేదా?  సమ్మెకు పోతే ఉద్యోగాలు తీసేస్తరా? ఇదెక్కడి న్యాయం.

– బుసి గౌరి, డ్రైవర్ భార్య ,ఆసిఫాబాద్

లోన్లు కట్టలేకపోతన్నం..

పదేళ్లుగా మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా​ పనిచేస్తున్న.  ఆర్టీసీల వచ్చే  జీతంతోనే కుటుంబం గడుస్తుంది. సర్కారేమో సమ్మెలో ఉన్న వాళ్లకు జీతం ఇయ్యనంటుంది.  పనిచేసిన నెలదైనా జీతం ఇయ్యాలే. ప్రతి నెలా ఇంటి లోన్​, వెహికల్​ లోన్​ కట్టాల్సి ఉన్నయి. జీతం రాక ఇబ్బంది పడుతున్నం. తెలంగాణ ఉద్యమంల  కొట్లాడిన కార్మికుల కుటుంబాల గోస పట్టించుకోకపోవడం సర్కారుకు మంచిది కాదు.
– ఎం. సైదయ్య  కండక్టర్, మిర్యాలగూడ

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు గొల్ల సోమయ్య. దుబ్బాక ఆర్టీసీ డిపోలో 20 సంవత్సరాల నుంచి డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. భార్య బాలలక్ష్మి బీడీలు చుడుతూ కుటుంబ పోషణకు తన వంతు సాయం చేస్తోంది.  సోమయ్యకు చదువుకుంటున్న  ముగ్గురు కొడుకులున్నారు.  దసరా ముందు సమ్మెకు దిగడంతో సోమయ్యకు వేతనం అందలేదు. తెలిసినవారి నుంచి రూ. 15 వేల చేబదులు తీసుకుని ఎలాగోలా పండుగ వెళ్లదీశాడు.  ప్రభుత్వం కార్మికులందరినీ డిస్మిస్​ చేసినట్లు ప్రకటించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. తమ బతుకులు ఏమవుతాయోననే ఆందోళన వారిని వెంటాడుతోంది.

ఈయన పేరు బోనగిరి రాంచంద్రం. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 20 ఏళ్ల నుంచి డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. రెండు దశాబ్దాలు గడిచినా నెలకు రూ. 25వేలు మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలోని అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుతున్న  రాంచంద్రం ఈ నెల జీతం రాక  పండుగలను జరుపుకోలేకపోయాడు.  ఇంటి అద్దె చెల్లించలేదు. నెలనెలా కట్టాల్సిన చీటీలు ఆగిపోయాయి.  ఎలాగో వారికి సర్ది చెబుతున్నా పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రాంచంద్రం ఆందోళన చెందుతున్నాడు.  తన రెండు దశాబ్దాల వృత్తి జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కొలేదని చెబుతున్నాడు.

జీతాల విషయంలో ప్రభుత్వానివి అబద్ధాలు

ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తున్న జీతాల విషయంలో ప్రభుత్వం అబద్ధాలాడుతోంది.  ఒక్కొక్కరికి 50 వేల వరకు జీతాలు ఇస్తున్నామని చెబుతున్నరు. మా నాన్న 26 సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన జీతం 28వేలు. కానీ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. నిరుద్యోగులు ఆలోచించి సమ్మె చేస్తున్న వారి పొట్టకొట్టవద్దని వేడుకుంటున్నా.

– ఆదిత్య ఇంజనీర్​, (ఆర్టీసీ గ్యారేజ్​ మెకానిక్ కొడుకు), ఆర్మూర్

ఉద్యోగం తీసేస్తే కుటుంబాలతో రోడ్డెక్కుతం..

ఆర్టీసీ కార్మికులకు దసరా సంతోషం లేకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేశారు. వారిని కూడా అందరితో సమానంగా చూడాల్సి ఉన్నప్పటికీ కావాలనే వేధిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ల కష్టానికి తగిన జీతాలు ఇవ్వడం లేదు. సమ్మె లో ఉన్న వాళ్లను డిస్మిస్​ చేస్తే  ఆర్టీసీ కార్మికుల కుటుంబీకులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తాం.

– శ్యామల, ఆర్మూర్​ (ఆర్టీసీ బస్ కండక్టర్​ భార్య)

పండగకు బట్టలు కూడా కొనియ్యలేదు

పదేళ్లుగా కండక్టర్​గా పనిచేస్తున్న.  సెప్టెంబర్​ నెల జీతం రాక ఇంట్ల వాళ్లకు పండుగకు బట్టలు కూడా కొనియ్యలేదు. దసరా పండుగ కన్నా ఇంట్లోళ్లను సంతోష పెట్టాలని నా డ్యూటీతో పాటు డబుల్​ డ్యూటీ చేసిన. సర్కారు​ సమ్మెలో ఉన్న కాలానికి జీతం ఇయ్యకుంటమాయే. సెప్టెంబర్​ నెలల డ్యూటీ చేసిన మొత్తం ఇయ్యకుంటే ఎట్ల.

– భాషా, మిర్యాలగూడ