మాగంటి ఫ్యామిలీలో సర్టిఫికెట్ లొల్లి

మాగంటి ఫ్యామిలీలో సర్టిఫికెట్ లొల్లి
  • జూబ్లీహిల్స్ బీఆర్ఎస్​ అభ్యర్థి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ​ఇవ్వడంపై అభ్యంతరం
  • శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఎదుట హాజరైన గోపినాథ్ తల్లి, మొదటి భార్య మాలినీ, కుమారుడు తారక్ ​ప్రద్యుమ్న
  • బీఆర్ఎస్ లీగల్​ అడ్వైజర్​తో వచ్చిన సునీత కూతురు దిశిర
  • నా కుమారుడి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: గోపినాథ్ తల్లి

గచ్చిబౌలి, వెలుగు: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపినాథ్​ కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ గొడవ సద్దుమనగడం లేదు. జూబ్లీహిల్స్​ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్​ఇవ్వడంపై గోపినాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

విచారణ అధికారిగా ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మార్వో వెంకారెడ్డి ఎదుట కుటుంబసభ్యులు ఇదివరకే ఒకసారి హాజరవ్వగా.. గురువారం గోపినాథ్ తల్లి మహానందకుమారి, కుమారుడు తారక్ ప్రద్యుమ్న, భార్య మాలినీ దేవి విచారణకు హాజరయ్యారు. సునీత కుమార్తె దిశిర బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్ లలితరెడ్డితో కలిసి విచారణకు హాజరయ్యారు. దీంతో ఎమ్మార్వో వెంకారెడ్డి ఇరువురి వాదనలు విని, ఫ్యామిలీ సర్టిఫికెట్ వివాదం కేసును ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.

కావాలనే కుట్ర చేస్తున్నరు

అనంతరం బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ లలితారెడ్డి మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యుల మధ్య  ఫ్యామిలీ సర్టిఫికెట్ విషయంపై వివాదం నడుస్తుందన్నారు.  ఓటర్ ఐడీ, పిల్లల ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులలో అన్నింటిలో మాగంటి ఇంటి పేరు, తండ్రిగా గోపినాథ్ పేరు ఉందన్నారు. మాగంటి గోపినాథ్, సునీతకు పుట్టిన పిల్లలే అక్షర, దిశిర, వాత్సల్య నాథ్ అని, అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన స్పౌస్ కార్డులో కూడా మాగంటి సునీత పేరు మాత్రమే ఉందని తెలియజేశారు. 

తారక్ ప్రద్యుమ్న రికార్డులో ఎక్కడా మాగంటి అనే పేరు లేదు, కోసరాజు అని మాత్రమే ఉందని చెప్పారు. మాలినీదే వి విషయంలోనూ డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే ఉంది కానీ వైఫ్ ఆఫ్ అని గోపినాథ్ పేరు లేదన్నారు. తహశీల్దార్ ఎదుట జరిగిన విచారణలో మాగంటి మొదటి భార్యగా చెబుతున్న వారు ఎలాంటి ఆధారాలు సమర్పించ లేదని తెలియజేశారు. ఈ ఇష్యూ వల్ల ఎన్నికలకు ఎలాంటి ఆటంకం జరగదని, కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు.

మా నాన్న చావుకు రాకుండా బెదిరించారు: తారక్ ​ప్రద్యుమ్న

విచారణ అనంతరం గోపినాథ్​ తల్లి మహానంద కుమారి మాట్లాడుతూ.. తన కుమారుడు గోపినాథ్ మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శ కోసం వెళితే తనను చూడనివ్వలేదన్నారు. తన కుమారుడిని పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్​ను అడిగినా తనను పట్టించుకోలేదని, ఆసుపత్రిలో అసలు ఏం జరిగిందో కేటీఆర్​ చెప్పాలని డిమాండ్ చేశారు. మాగంటి సునీత పోటీచేస్తున్నట్లు మాకు ఎవరూ చెప్పలేదని, మాగంటి గోపినాథ్ తల్లిగా నేను బతికే ఉండగా నన్ను పట్టించుకోలే దన్నారు. 

తారక్ ప్రద్యుమ్న.. గోపినాథ్ వారసుడని, అతనికి ఆస్తిలో వాటా రావాల్సి ఉందన్నారు. గోపినాథ్ లేడు కనుక మనవడికి అండగా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు. గోపినాథ్ మొదటి కుమారుడు తారక్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపేందుకు వచ్చామన్నారు. మా నాన్న మాతో బాగానే మాట్లాడేవారని, చనిపోయే వరకు మాతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చనిపోయినప్పుడు మేము రాకుండా కొందరు మమ్మల్ని బెదిరించారని తెలిపారు.