జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్‎ను దెబ్బకొట్టిన ఫ్యామిలీ వివాదం.. సెంటిమెంట్ అస్త్రం విఫలం

 జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్‎ను దెబ్బకొట్టిన ఫ్యామిలీ వివాదం.. సెంటిమెంట్ అస్త్రం విఫలం

హైదరాబాద్​, వెలుగు:  మాగంటి గోపీనాథ్​ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు జూబ్లీహిల్స్‎లో బీఆర్ఎస్​ను దెబ్బకొట్టాయి. తన కొడుకు గోపీనాథ్​ మరణంపై అనుమానాలున్నాయని తల్లి పోలీసులను ఆశ్రయించింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ఇవ్వడంపై గోపీనాథ్​ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్​ మీడియా ముందుకు వచ్చారు.

మొదటి భార్యను తానున్నాక సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఎలా ఇస్తారంటూ  మాలినీదేవి ప్రశ్నించారు. ఈ విషయంలో తమను బీఆర్​ఎస్​ నేతలు బెదిరిస్తున్నారంటూ వాళ్లు ఆరోపణలూ చేశారు. ఇటు గోపీనాథ్​ తల్లి  మహానంద కుమారి కూడా మీడియా ముందుకు వచ్చి.. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానంద కుమారి, మాలినీ దేవి, ప్రద్యుమ్న తారక్​ కలిసి శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు సైతం చేశారు.  

సెంటిమెంట్​ అస్త్రాన్ని ప్రయోగించి..!

అభ్యర్థిని ప్రకటించింది మొదలు బీఆర్​ఎస్​ పార్టీ సెంటిమెంట్​నే ప్రయోగించింది. గోపీనాథ్​ మృతితో వచ్చిన ఉప  ఎన్నికలో ఆయన భార్య సునీతను గెలిపించుకోవాలని ప్రతి మీటింగ్​లోనూ చెప్పుకుంటూ వచ్చింది. ఆడబిడ్డ అనే సెంటిమెంట్​నూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆడబిడ్డపై అందరూ కలిసి దాడి చేస్తున్నారంటూ కేటీఆర్​ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చినా.. మరి వాళ్ల సొంత ఇంటి ఆడబిడ్డపై అడుగడుగునా చేసిన దాడుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ జనాల్లో ఆలోచన రేకెత్తించింది.