నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు

నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు

ఏపీ మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. హైదరాబాద్ కొండాపూర్ లోని నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు... నారాయణను అదుపులోకి తీసుకున్నారు.  ఏపీలో టెన్త్ పేపర్ లీకేజీలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉందని.. చిత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో క్వశ్చన్ పేపర్ లీకేజీలో నారాయణను అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచీలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. తెలుగు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9 గంటల 57 నిమిషాలకు వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ బయటకొచ్చింది. చిత్తూరులోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ బయటకొచ్చింది. దీంతో నారాయణ స్కూల్స్ కు క్వశ్చన్ లీకేజీతో సంబంధం ఉందనే ఆరోపణలతో నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు చిత్తూరు పోలీసులు. 

అయితే అరెస్ట్ సమయంలో నారాయణను కిడ్నాప్ చేస్తున్నారని డయల్ హండ్రెడ్ కు కాల్ చేశారు నారాయణ అనుచరులు. దీంతో తెలంగాణ పోలీసులు కొత్తూరు బైపాస్ దగ్గర నారాయణను తీసుకెళ్తున్న ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో తాము ఏపీ సీఐడీ పోలీసులమని.. పేపర్ లీకేజీ కేసులో నారాయణను అదుపులోకి తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో వదిలేశామన్నారు కొత్తూరు సీఐ బాలరాజు.

మరోవైపు నారాయణపై మరో కేసును తెరపైకి తెచ్చారు ఏపీ సీఐడీ అధికారులు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో చంద్రబాబు ఏ-1గా, నారాయణ ఏ-2గా, ఏ-3గా లింగమనేని రమేష్, ఏ-4గా లింగమనేని శేఖర్ ఉన్నారని తెలిపారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ల్యాండ్ పూలింగ్ పై విచారణ చేస్తున్నారు ఏపీ సీఐడీ అధికారులు.