వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాల.. పోలీసులు నోటీసులు జారీ

వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాల.. పోలీసులు నోటీసులు జారీ

ఎల్బీనగర్, వెలుగు: ప్రముఖ సినీనటుడు రాజీవ్​ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఓ భూమికి సంబంధించి రాచకొండ కమిషనరేట్​పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. హయత్​నగర్ పోలీస్​స్టేషన్​లో ఆయన మేనేజర్ పై నమోదైన కేసులో విచారణకు రావాలని హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాములలో రాజీవ్​కనకాల తండ్రి దేవదాస్​కనకాలకు ఓ ప్లాటు ఉంది. 

దాన్ని రాజీవ్ కనకాల మేనేజర్, సినీ నిర్మాత అయిన విజయ్​చౌదరికి విక్రయించి రిజిస్ట్రేషన్​ చేశారు. విజయ్​చౌదరి సదరు ప్లాటును ఎల్బీనగర్​కు చెందిన శ్రావణ్​రెడ్డికి అమ్మాడు. ఏడాది కింద శ్రావణ్​రెడ్డి తన ప్లాటు పొజిషన్​కు వెళ్లగా.. సదరు నంబర్​ప్లాట్​లేకుండా ఆనవాళ్లు చెరిపేసి ఉన్నాయి. దీనిపై శ్రావణ్ రెడ్డి.. విజయ్​ చౌదరిని సంప్రదించగా ప్లాట్​ఇవ్వబోనని దానిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేత సమాధానమిచ్చారు. 

ఏడాదిగా ఎన్నిసార్లు సంప్రదించినా ప్లాటును చూపకపోగా సదరు ప్లాటు ఉన్నదని ఒకసారి.. అసలు లేదని ఒకసారి.. ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఇంటికి వెళ్లి నిలదీస్తే.. అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు హయత్​నగర్ ​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్​చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ప్లాటు విక్రయదారు, వెంచర్​భాగస్వామి, సినీనటుడు రాజీవ్ ​కనకాలకు నోటీసులు ఇచ్చారు.

 అయితే, ప్లాట్ విక్రయంలో ఉద్దేశ్యపూర్వకంగానే మోసం జరిగిందని  ఇందులో రాజీవ్ కనకాల హస్తం ఉందని బాధితుడు, విజయ్ చౌదరి పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ ప్లాటు విషయంలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.