ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ తో RTAకు కాసుల పంట

ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ తో RTAకు కాసుల పంట

హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ ఖైరతాబాద్ ఆర్టీఏకు కాసులు కురిపించింది. సోమవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒక్కరోజులోనే రూ.30,55,748 వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ తెలిపారు. ఎప్పటి మాదిరిగా ఆల్ నైన్స్ నంబర్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నంబర్ ను దక్కించుకునేందుకు ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ రూ.10 లక్షలు చెల్లించింది. టీఎస్ 09 ఎఫ్ఈ 9999 నంబర్ కు వేలంలో పదిలక్షల రూపాయలు పలికింది. రూ.1,63,67,000 విలువ గలిగిన టొయోటా ల్యాం డ్ క్రూజర్ వాహనాన్ని కొను గోలు చేసిన ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నంబర్ ను దక్కించుకుంది.

TS 09 FF 0001 నంబర్ కోసం ఎఫ్ఆర్ఆర్ఎన్ హిల్ హోటల్స్ సంస్థ రూ.6,95,000 చెల్లించింది. టీఎస్09 ఎఫ్ఎఫ్ 0099 నంబర్ కోసం ఎమర్జీన్ అగ్రీనోవో సంస్థ రూ.2,78,000 చెల్లించింది. వీటితో పాటు పలు ఫ్యాన్సీ నంబర్ల కోసం జరిగిన వేలంలో ఏకంగా 30 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గతంలోనూ ఆల్ నైన్స్ నంబర్ కోసం పలువురు సినిమా, వ్యాపార  ప్రముఖులు పోటీ పడి ఈ నంబర్ ను దక్కించుకున్నారు. చాలా మందికి ఆల్ నైన్స్ నంబర్ సెంటిమెంట్ గా ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆల్ నైన్స్ నంబర్ కోసం పదిలక్షల రూపాయలకు పైగా చెల్లించారు.