
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) 5వ ఎడిషన్ ఆగస్టు 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో కర్టెన్‌రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జ్యూరీ సభ్యులు, దర్శకులు ఏ కోదండ రామిరెడ్డి, బి.గోపాల్ మాట్లాడుతూ ‘అవార్డ్స్ అనేవి నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. 2024లో విడుదలైన చిత్రాల్లో 24 క్రాఫ్ట్స్‌కు ఈ అవార్డ్స్‌ను అందించనున్నాం.
ఇందులో జ్యూరీ సభ్యులుగా వ్యవహరించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ ‘దుబాయ్‌లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాం. ఈ వేడుకలో పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ పాల్గొనబోతున్నారు’ అని చెప్పారు.
ఈ అవార్డ్ ఫంక్షన్‌లో స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో తాము అలరించబోతున్నట్టు హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి చెప్పారు. ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని దక్షా నగార్కర్ చెప్పింది. గామా అవార్డ్స్‌లో యాంకర్ సుమతో పాటు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు నటుడు వైవా హర్ష చెప్పాడు.