తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ .. రూ.లక్షలోపు.. రుణాలు మాఫీ

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ ..  రూ.లక్షలోపు.. రుణాలు మాఫీ
  • రూ.6,546.05 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • తాజాగా 10.79 లక్షల మంది లోన్ల చెల్లింపు
  • మాఫీ కోసం మరో 14.34 లక్షల 
  • మంది రైతుల ఎదురుచూపు
  • వీరంతా రూ.లక్ష వరకు లోన్ ఉన్నోళ్లు
  • హామీ పూర్తికి మరో 11,445 కోట్లు కావాలె

హైదరాబాద్‌‌, వెలుగు: రైతుల పంట రుణాల మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,546.05 కోట్లను విడుదల చేసింది. 10,79,721 మంది రైతులకు సంబంధించి లక్ష రూపాయల లోపు(రూ.99,999) రుణాల చెల్లింపు కోసం ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తాజా నిధుల విడుదలతో ప్రభుత్వం ఇప్పటి వరకు 16.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లయింది.  అయితే రూ.లక్ష వరకు ఉన్న లోన్ల మాఫీకోసం ఇంకా 14 లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం మరో రూ.11 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి.

రూ.లక్ష వరకు ఉన్న రుణాలే ఎక్కువ

రూ.లక్ష వరకు క్రాప్​లోన్లు మాఫీ చేస్తామని బీఆర్ఎస్​ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు 2018 డిసెంబర్ 11ను కటాఫ్‌‌ తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన లోన్లు మొత్తం రూ.25,936 కోట్లు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. అయితే రైతులు, వారి కుటుంబ సభ్యులపై కలిపి మొత్తంగా ఒక లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం రెండేండ్ల కింద నిబంధన తీసుకువచ్చింది. దీంతో 3.98 లక్షల మంది రైతులు అనర్హులయ్యారు. 

దీంతో రాష్ట్రంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198.38 కోట్లు అవసరమని సర్కార్ నిర్ణయించింది. సోమవారం రూ.99,999 వరకు లోన్ ఉన్న 10.79 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ.6,546.05 కోట్లు రిలీజ్​చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16.66 లక్షల మందికి రైతులకు సంబంధించిన రూ.7753.43 కోట్ల క్రాప్​లోన్లు మాఫీ చేసినట్లయింది. అయితే ఇంకా 14.34 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న రుణాలు పెండింగ్ ఉన్నాయి. వీటిని మాఫీ చేయాలంటే రూ.11,445.95 కోట్లు అవసరం.

నిధుల విడుదల ఇలా

2018లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ నాలుగు దఫాలుగా చేస్తామని ప్రకటించింది. కానీ ఈ నాలుగున్నర ఏండ్లలో 5.66 లక్షల మంది రైతుల లోన్ల మాఫీకి రూ.1,207 కోట్లు రిలీజ్​చేసింది. తాజాగా ఈ ఆగస్టు నెల నుంచి కొద్దికొద్దిగా మాఫీ చేస్తూ వస్తున్నది. 3వ తేదీన రూ.237. 85 కోట్లు, 4వ తేదీన రూ.126.50కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. సోమవారం రూ.లక్ష లోపు క్రాప్​లోన్ల మాఫీ కోసం రూ.6,546.05 కోట్లను విడుదల చేసింది.