పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి ఆగిన రైతు గుండె

పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి ఆగిన రైతు గుండె

పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి
తహశీల్దార్ ఆఫీస్‌లో మనస్తాపంతో
గుండె ఆగిన రైతు

జహీరాబాద్, వెలుగు: పట్టాపాస్‌ బుక్కు ఆఫీస్‌ చుట్టూ తిరిగితిరిగి మనస్తాపంతో ఓరైతు గుండె ఆగింది. బుధవారం కోహిర్‌ తహసీల్దార్‌ ఆఫీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనియర్​పల్లి తండా వాసుల కథనం ప్రకారం కోహీర్ మండలం మనియర్​పల్లి పంచాయతీ పరిధిలోని మనియర్ పల్లి తండాకు చెందిన తుల్జా నాయక్​(56) తన నాలుగు ఎకరాల పొలానికి కొత్త పాసు బుక్‌ కోసం కొన్ని రోజులుగా తహసీల్దార్ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీసర్లు పాసుబుక్‌ ఇవ్వకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఆవేదన చెందుతున్నాడు. బుధవారం మరోసారి ఆఫీస్‌కు వచ్చిన ఆయనకు ఆఫీసర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో మనస్తాపనికి గురై గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు.  ఈ విషయం తెలుసుకున్న తండా వాసులు తహసీల్దార్ ఆఫీస్‌ ఎదుట తుల్జానాయక్ మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్, వెలుగు: భూ వివాదం పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లాలోని నరసింహుపేట మండలం తహసీల్దార్ ఆఫీస్‌ వద్ద ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడం కలకలకం రేపింది. స్థానికుల కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామానికి చెందిన దాసరోజు సోమ నర్సయ్యకు చెందిన 11.33 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన రైతు బుద్ధ బిక్షం సాగు చేశాడు. 2012లో భూమి కొనుగోలు చేసినట్లు బిక్షం భార్య నాగలక్ష్మి పేరిట పట్టా అయింది. అయితే తను భూమి అమ్మలేదని దాసరోజు సోమనర్సయ్య కోర్టుకు వెళ్లాడు. తన భూమి పట్ల తనకు హక్కులు కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య దాసరోజు సోమనర్సయ్య పేరిట పాస్ పుస్తకాలు అందించాలని నరసింహులపేట తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆర్డీవో రిపోర్ట్‌ మేరకు పాస్‌బుక్‌ అందించింది. కాగా బుధవారం నాగలక్ష్మి, బిక్షం దంపతులు తమకు అన్యాయం జరిగిందని తమ భూమి తనకు కావాలంటూ తహసీల్దార్ ఆఫీస్‌ పైకి ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని ఆపారు.