హైదరాబాద్, వెలుగు: బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొంటూ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
