- దర్యాప్తు ముగింపు దశకు వచ్చిందన్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: సిగాచీ కంపెనీ పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.42 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్టు ఆ సంస్థ హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఘటనపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తు ముగింపు దశకు వచ్చిందని, ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులను ఇంకా గుర్తించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మరణించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది కనిపించకుండా పోయారు.
28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ సిటీకి చెందిన కె. బాబూరావు వేసిన పిల్‌ను బుధవారం చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2వ నిందితుడు, సిగాచీ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారని, ఇంకో అయిదుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.
ప్రభుత్వ అధికారులతోపాటు పలువురిని విచారించామన్నారు. ఇంతవరకు జరిగిన దర్యాప్తులో నేరానికి ఎవరు పాల్పడ్డారనేది తేలలేదని, దర్యాప్తు ముగింపు దశకు చేరిందని, త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ. 22 కోట్ల పరిహారం చెల్లించినట్టు చెప్పారు. ఆచూకీ తెలియని ఎనిమిది మంది కార్మికులకు చెందిన మరణ ధ్రువీకరణ పత్రాలు వారి కుటుంబసభ్యులకు అందజేశామని.. వారి కుటుంబసభ్యులకు కూడా పరిహారం అందజేసినట్టు తెలిపారు.
