- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని బొక్కల్‌గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు హక్కులు లభిస్తున్నాయన్నారు.
విద్య ద్వారా గౌరవం లభిస్తుందని, విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు ఎలాంటి పరిమితులు విధించకుండా తల్లిదండ్రులు వారి విద్య, భవిష్యత్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్‌ను నాషనం చేసుకుంటున్నారని, వాటిపై జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వృద్ధులకు చేతికర్రలు, మంకీ క్యాపులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై అశోక్, ఎంఈవో సోమయ్య, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలో అయన పాల్గొని మాట్లాడారు. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్, కార్ డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫాహిమా సుల్తానా, రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.
న్యూ ఇయర్‌కు బోకేలు, స్వీట్లు వద్దు
జిల్లా ప్రజలందరికీ కలెక్టర్కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపేందుకు తనను కలవడానికి వచ్చే అధికారులు.. ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, స్వీట్లు కాకుండా, సమాజానికి ఉపయోగపడే బహుమతులు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ‘కం విత్ బుక్’ అనే నినాదంతో పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల లైబ్రరీకి విరాళంగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, పఠన అలవాటు మరింత బలపడుతుందని కలెక్టర్ తెలిపారు. బొకేలు, శాలువాల బదులు పేదలకు ఉపయోగపడే వస్తువులను మాత్రమే బహుమతులుగా తీసుకురావాలని సూచించారు. దుప్పట్లు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రి వంటి వస్తువులను జిల్లాలోని పేద ప్రజలకు, నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు.
