పరిగి, వెలుగు: రాజకీయ కక్షతో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పూడూరు మండలంలోని కండ్లపల్లిలో జరిగింది. చెన్గోముల్ ఎస్సై భరత్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కండ్లపల్లి గ్రామానికి చెందిన హకీం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సపోర్ట్ చేశారు.
ఆ అభ్యర్థి ఎన్నికల్లో గెలువగా.. ఓడిపోయిన అభ్యర్థి మనుషులు హకీంపై కోపం పెంచుకున్నారు. వారంతా కలిసి కండ్లపల్లి గ్రామానికి చెందిన నాంచేరి శంకర్‌ను హత్యకు ఉసిగొల్పారు. దీంతో శంకర్.. హకీంను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.
మంగళవారం రాత్రి కండ్లపల్లి గ్రామంలో చాయిబంక్ కేఫ్ సెంటర్‌కు హకీంను మాట్లాడుకుందామని పిలిచాడు. హకీం అక్కడికి వెళ్లగా తన వెంట తెచ్చుకున్న కత్తితో శంకర్ దాడి చేశాడు. కత్తి పోటు పడగానే హకీం పరుగు తీసి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
