పర్యాటకులకు డిజిటల్ ట్రావెల్ కార్డులు : మంత్రి జూపల్లి కృష్ణారావు

పర్యాటకులకు డిజిటల్ ట్రావెల్ కార్డులు : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     హైదరాబాద్- సోమశిల- శ్రీశైలం సర్క్యూట్‌‌లో హెలీ టూరిజం సేవలు: మంత్రి జూపల్లి
  •     2025 విజయాలు.. 2026 లక్ష్యాలను వెల్లడించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: పర్యాటకులకు యూనిఫైడ్ ఆన్‌‌లైన్ పోర్టల్, డిజిటల్ ట్రావెల్ కార్డుల వంటి వినూత్న సేవలకు శ్రీకారం చుట్టిన‌‌ట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్  సోమశిల శ్రీశైలం సర్క్యూట్‌‌లో హెలీ టూరిజం సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. 2025 విజయాలు.. 2026 లక్ష్యాలను బుధ‌‌వారం మంత్రి జూపల్లి వెల్లడించారు. టూరిస్ట్ పోలీస్  వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ వంటి ప్రాంతాలను అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 

టూరిజం కాంక్లేవ్  ద్వారా 30 ప్రాజెక్టులకు గానూ రూ.15,279 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని.. తద్వారా సుమారు 50 వేల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ‘‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్  ద్వారా మరో రూ.7,045 కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాల సృష్టి జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 123 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 78 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశ్ దర్శన్ 2.0,  ప్రసాద్ కింద రూ. 275 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయి. 

హుస్సేన్ సాగర్‌‌లో డబుల్ డెక్కర్ బోటును అందుబాటులోకి తెచ్చాం”అని తెలిపారు. మిస్ ​వరల్డ్ ​పోటీలు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశారని చెప్పారు.1,354 మంది మహిళలతో బతుకమ్మను నిర్వహించి రెండు గిన్నిస్ రికార్డులు సాధించామని తెలిపారు. ఎకో,  మెడిక‌‌ల్, హెరిటెజ్, స్పిరిచ్​వల్, రూర‌‌ల్ అండ్ ట్రైబ‌‌ల్, సినిమా, స్పోర్ట్స్ టూరిజంపై దృష్టిసారించి తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ని అమలులోకి తెచ్చామని మంత్రి తెలిపారు.