పొలానికి నీళ్లు పారిస్తుండగా.. గుండెపోటుతో రైతు మృతి

పొలానికి నీళ్లు పారిస్తుండగా.. గుండెపోటుతో రైతు మృతి

ధర్మసాగర్ , వెలుగు :  పొలానికి నీళ్లు పారించడానికి వెళ్లిన రైతు గుండెపోటుతో  చనిపోయాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లకు చెందిన బజ్జూరి రాజు సోమవారం పొలానికి నీళ్ల పారించడానికి వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. పక్క పొలంలో ఉన్నవారు గమనించి కుటుంబసభ్యులకు చెప్పారు. మృతుడి భార్య రమ వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. రాజుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రాజు కుటుంబానికి అదే గ్రామానికి చెందిన వంగాల నారాయణ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.  

కరెంట్ ​షాక్​తో అన్నదాత కన్నుమూత 

మానకొండూరు, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద ట్రాన్స్​ఫార్మర్​ఆన్ చేస్తూ కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం..లింగాపూర్​కు చెందిన పిట్టల సంపత్ (36) భార్య మమతతో కలిసి సోమవారం శివారులో కౌలుకు తీసుకున్న పొలానికి వెళ్లాడు. మోటార్​ రెండు రోజుల నుంచి నీళ్లు పోయకపోవడంతో ట్రాన్స్​ఫార్మర్​ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మమత వెళ్లి చూడగా షాక్ తో కింద పడిపోయిన భర్త కనిపించాడు. దీంతో కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజ్ కుమార్ తెలిపారు.