మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
  • దిగుబడి రాక, అప్పు తీర్చ లేక  ములుగు జిల్లాలో ఒకరు
  • సిద్దిపేట జిల్లాలో ‘ధరణి’లో తప్పుకు మరో రైతు బలి 
  • వైరస్​తో మిర్చి పంట ఎండిందని ఒకరు.. 
  • ధరణి పొరపాటుకు మరొకరు బలి

ఏటూరునాగారం /  గజ్వేల్, వెలుగు: వైరస్​సోకి రెండు ఎకరాల మిర్చి పంట మొత్తం ఎండిపోయిందని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాకకు చెందిన రైతు సొనప హనుమయ్య(48) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఈయేడు పంట మంచిగా పండితే వచ్చే పైసలతో పెద్దబిడ్డ పెండ్లి చేయాలని ఆశపడ్డాడు. తన నాలుగు ఎకరాల సొంత భూమిలో రెండు ఎకరాల్లో వరి, మరో రెండు ఎకరాల్లో మిర్చి వేశాడు. పెట్టుబడి కోసం అప్పు చేసి పంటలు సాగు చేశాడు. హనుమయ్య రెండెకరాల పంటకు వైరస్​సోకి పూర్తిగా ఎండి పోయింది. దీంతో అప్పు ఎలా తీర్చాలి? బిడ్డ పెండ్లి ఎలా చేయాలని ఆందోళన చెందాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఏటూరు నాగారం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.  

14 గుంటల భూమి కోసం చెప్పులరిగేలా తిరిగి సూసైడ్
ఉన్న కొద్దిపాటి భూమి అమ్మి అప్పు తీసేద్దామనుకున్న  రైతును ధరణి ఎంట్రీలో జరిగిన తప్పులు ప్రాణం తీసుకునేలా చేశాయి. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన చింతల స్వామి(45) భార్య బాలలక్ష్మి, కొడుకులు ప్రశాంత్, ప్రకాశ్​లతో హైదరాబాద్​వలస వెళ్లాడు. అక్కడ అప్పులు చేసి ఇల్లు కొన్నాడు. అప్పు పెరిగి ఇబ్బందులు మొదలవడంతో గ్రామంలో తన తండ్రి నర్సయ్య పేరిట ఉన్న 14.5 గుంటల భూమిని అమ్మేద్దామని స్వామి నిర్ణయించుకున్నాడు. అదే ఆలోచనతో గ్రామానికి తిరిగి వచ్చాడు. 2019లో ధరణిలో తప్పుగా ఎంట్రీ చేయడంతో నర్సయ్యకు చెందిన 14 .5 గుంటల భూమి వేరే వ్యక్తుల పేరు మీదికి మారింది. అప్పటి నుంచి స్వామి తండ్రి నర్సయ్యతో కలిసి రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాడు. అదే ఏడాది చనిపోయాడు. ఆ తర్వాత కూడా స్వామి ఆఫీసర్ల చుట్టూ తిరగడం ఆపలేదు. ‘‘ధరణి పోర్టల్​లో ఒకరి భూమి పొరపాటున మరొకరి పేరున పడితే దాన్ని మార్చడానికి ఎలాంటి ఆప్షన్​లేదని, ఎంట్రీ అయిన భూమి వివరాలు మార్చడానికి వీలు కాదని, ఎవరి పేరిన పడిందో వారితోనే రిజిస్ట్రేషన్​చేసుకోమని’’ రెవెన్యూ ఆఫీసర్లు చెప్పడంతో చేసేదేం లేక స్వామి ఎవరి పేరు మీదికి ఎక్కిందో వారిని ఒప్పించడానికి సర్పంచి, పెద్ద మనుషులతో కలిసి ప్రయత్నం చేశాడు. శనివారం మరోసారి భూమి గురించి మట్లాడటానికి తహసీల్దార్​ఆఫీస్​కు వెళ్లాడు. కాగా తన భూమి ఎవరి పేరిట అయితే పడిందో వారు భూమిని కుదువ పెట్టి బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారని స్వామికి తెలిసింది. మార్టిగేజ్​ఉంటే రిజిస్ట్రేషన్​చేయడం కుదరదని ఆఫీసర్లు చెప్పటంతో స్వామి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తన ఆవేదనను వివరిస్తూ సూసైడ్​నోట్​రాసి జేబులో పెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు ఫైల్​చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాదాద్రి కలెక్టరేట్​లో రైతు ఆత్మహత్యాయత్నం
15 ఏండ్లుగా పాస్​బుక్​ ఇస్తలేరని ఆందోళన

యాదాద్రి, వెలుగు:
పదిహేను ఏండ్లుగా తిరుగుతున్నా ఆఫీసర్లు తన భూమికి పాస్ బుక్ ఇవ్వట్లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన బుడిగె ఉప్పలయ్య కొడుకు మహేశ్ సోమవారం ఉదయం10 గంటలకు బ్యాగులో పెట్రోల్​క్యాన్​పెట్టుకుని స్థానిక కలెక్టరేట్ కు వెళ్లి పెట్రోల్​మీద పోసుకున్నాడు. కలెక్టరేట్​స్టాఫ్​అతడిని అడ్డుకున్నారు. తనకు ఆలేరు మండలం కొలనుపాక శివారులో 8 ఎకరాల భూమి ఉందని, అందులో 4 ఎకరాలకు పాస్​బుక్​ఉండగా మిగతాది ఎక్కలేదన్నాడు. దానికోసం 2006 నుంచి తన తండ్రి ఉప్పలయ్య తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నాడు. అక్కడికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్​రెడ్డి.. ఆలేరు తహసీల్దార్ గణేశ్ నాయక్​ను పిలిపించి, రికార్డులు తెప్పించి పరిశీలించారు. భూవివాదం ట్రిబ్యునల్ డిస్మిస్ చేసినందున సివిల్​కోర్టుకు వెళ్లాలని యువకుడికి అడిషనల్ కలెక్టర్ సూచించారు. కావాల్సిన డాక్యుమెంట్లు, సర్వే వంటి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.