కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాల నేతలు

కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాల నేతలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో ఎనిమిది చట్టాల సవరణకు చేసిన ప్రతిపాదనపై రైతు సంఘాలు స్పందించాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే సవరణలతో ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పాయి.బుధవారం నాడు సాయంత్రం రైతు సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదించిన చట్టసవరణల్ని తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించారు.రైతుల ఆందోళనలకు దేశంలోని 25 పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. దేశంలోని అన్ని జిల్లాలు రాష్ట్ర రాజధానులలో నిరంతరాయంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి.

డిసెంబర్ 12న ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్భంధించనున్నట్టుగా రైతు సంఘాల నేతలు తెలిపారు. ఆందోళనలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిన్న జరిగిన చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాకి చెప్పిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు.కేంద్రమంత్రులను ఎక్కడికక్కడే ఘోరావ్ చేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల‌ 14న దేశంలోని అన్ని బీజేపీ కార్యాల‌యాల‌ను ముట్ట‌డించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ర‌హ‌దారుల దిగ్బంధనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీకి త‌ర‌లిరావాల‌ని రైతు సంఘాల నేత‌లు కోరారు.