పంట ఎండిపోవడంతో రైతు సూసైడ్

పంట ఎండిపోవడంతో రైతు సూసైడ్

మొగుళ్లపల్లి, వెలుగు: సాగు చేసిన వరి పంట ఎండిపోయిందని రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన శనివారం అర్ధరాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో జరిగింది. ఎస్సై తీగల మాధవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు మేడిపల్లి రాయలింగు (53) పర్లపల్లి గ్రామానికి చెందినవాడు. నెల రోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేశాడు. వాతావరణ మార్పుల కారణంగా వరి పంట చీడపీడల బారిన పడి ఎండిపోయే స్థితికి వచ్చింది. వాటిని అదుపు చేయడానికి ఆయన ఫిబ్రవరి 28న పంటకు పురుగుల మందు పిచికారీ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ, అప్పటికే పంట పూర్తిగా ఎండిపోయింది. 

దీంతో మనస్తాపానికి గురైన రైతు పిచికారీ కోసం తీసుకొచ్చిన పురుగుల మందునే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య రాజేశ్వరి ఇది గమనించి చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆయన చనిపోయాడు. రైతు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. ఈ నేపథ్యంలో  రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక నేతలు కోరారు.