- సఫలమైన లోతుకుంట డీఎల్ఎన్సీ సమావేశం
- భూములిచ్చేందుకు రైతుల అంగీకారం
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: రాజీవ్ రహదారి విస్తరణ కోసం లోతుకుంట ప్రాంత రైతులు, స్థల యజమానులు స్వచ్ఛందంగా భూములివ్వడానికి ముందుకు రావడంపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి హర్షం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి చర్చల కమిటీ (డీఎల్ఎన్సీ) సమావేశంలో ఆయన భూసేకరణపై రైతులతో చర్చించారు.
ఈ సందర్భంగా తమ భూములకు మంచి రేటు ఇవ్వాలని రైతులు కోరగా, అల్వాల్ సబ్-రిజిస్ట్రార్ రికార్డులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తరఫున అత్యుత్తమ ధర అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయంతో సంతృప్తి చెందిన రైతులు భూములిచ్చేందుకు అంగీకరించడంతో లోతుకుంట భూసేకరణ ప్రక్రియ సఫలమైంది. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాలతి, హెచ్ఎండిఏ అధికారులు, అల్వాల్ తహసీల్దార్ రాములు పాల్గొన్నారు
