- ఆన్ లైన్లో దరఖాస్తులను క్యాన్సల్
- చేసినట్లు చూపిస్తున్న ‘భూభారతి’
- రిజెక్ట్ చేయకపోవడంతో అసలు కారణం తెలుసుకోలేని దుస్థితి
- 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే
- పరిష్కారమైంది కేవలం 80 వేల లోపే
- ఎలాంటి సమాచారం ఇవ్వకుండా
- ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంపై అయోమయం
- అధికారుల నిర్వాకంతో మళ్లీ ఆఫీసుల చుట్టూ
- తిరుగుతున్న రైతులుమళ్లీ కొత్తగా అప్లై
- చేసుకోవాలంటూ ఉచిత సలహాలు
హైదరాబాద్, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అప్లికేషన్లన్నీ ఆన్‌లైన్ లో అనూహ్యంగా గాయబ్ అయ్యాయి. తమ సమస్యలు ఇవాలో, రేపో పరిష్కారమవుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో, ఏకంగా దరఖాస్తులన్నీ క్యాన్సల్ అయినట్లు భూభారతి పోర్టల్ చూపిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నఫలంగా ఆన్లైన్లోంచి అప్లికేషన్లను తొలగించడంతో కారణమేంటో తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులకు.. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలంటూ సిబ్బంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి అధికారుల లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల అప్లికేషన్లు వస్తే, అందులో ఇప్పటివరకు కేవలం 80 వేల లోపు దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం దొరికింది. మిగిలిన లక్షలాది దరఖాస్తులను క్యాన్సల్ చేయడంతో భూ యజమానులు, రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
తమ ఏళ్ల నాటి సమస్యలు తీరుతాయని ఆశించిన వారికి, భూభారతి పోర్టల్ లో నెలకొన్న ఈ సాంకేతిక గందరగోళం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన విధానమే, ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతో రైతుల పాలిట శాపంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్షల దరఖాస్తులు.. బుట్టదాఖలేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 594 మండలాల్లోని సుమారు 10,226 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. గతేడాది జూన్ 2 నుంచి దాదాపు నెలన్నర పాటు ఈ సదస్సుల ద్వారా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ సదస్సుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,27,230 దరఖాస్తులు అందాయి. సర్వే నంబర్లలో లోపాలు, పీపీబీ, ఆర్ ఓఆర్ , నాలా , ఆర్ఎస్ఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడు భూములు వంటి 30 రకాల భూ సమస్యలపై ఈ అప్లికేషన్లు అందాయి. వచ్చిన దరఖాస్తుల్లో కేవలం సాదా బైనామా కింద పరిష్కరించాల్సినవి 2.50 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ సాదా బైనామా దరఖాస్తులు పోను మిగిలిన దాదాపు 6 లక్షల అప్లికేషన్ల పరిష్కారంపై ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. వాటన్నింటిని విధిగా భూభారతి పోర్టల్ లో అప్ లోడ్ చేసి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించింది. లక్షలాది దరఖాస్తులు రావడం, క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి పరిష్కరించేంత సిబ్బంది లేకపోవడంతోనే ఈ ప్రక్రియ అటకెక్కినట్లు తెలుస్తున్నది.
విచారణ లేదు.. నోటీసులు లేవు..
ప్రతి దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులకు విధిగా నోటీసులు జారీ చేయాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్ గా మార్చి భూభారతి పోర్టల్ లో పకడ్బందీగా అప్ లోడ్ చేయాలని నిర్దేశించింది. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ లో లోపాలుంటే దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ వివరాలను కూడా రికార్డు చేయాలని స్పష్టంచేసింది. అలాగే తిరస్కరణకు గల నిర్దిష్టమైన కారణాలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారులకు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనీస పరిశీలన చేయకుండా, ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంతో రైతులకు ఏమి పాలుపోవడం లేదు. సాంకేతికంగా రిజెక్ట్ చేయకుండా, నేరుగా సిస్టమ్ నుంచి క్యాన్సిల్ చేయడంతో అసలు దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలు కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. అదే సమయంలో గ్రామాల్లో స్వీకరించిన మరికొన్ని దరఖాస్తులను అసలు భూభారతిలో నమోదు చేయకపోవడంతో వాటి పరిస్థితి ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తులదీ ఇదే పరిస్థితి..
రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చిన దరఖాస్తులదే కాదు, భూభారతి పోర్టల్ ద్వారా నేరుగా పెట్టుకున్న అప్లికేషన్ల పరిస్థితి ఇలాగే ఉంది. అసలు అప్లికేషన్ రిజెక్ట్ అయిందా? రిజెక్ట్చేస్తే ఎందుకు చేశారు? లోపాలు ఏంటి? తదితర సరైన కారణాలు చెప్పే వ్యవస్థ సిస్టమ్ లో లేదు. పోనీ సదరు అప్లికేషన్ స్టేటస్కూడా తెలియడం లేదు. ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉందా, తహసీల్దార్ వద్ద ఆగిందా, ఆర్డీవో వద్ద ఆగిందా? లాంటి వివరాలు కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉన్నది. తమ అప్లికేషన్ పరిస్థితి ఏంటో తెలుసు కుందామని ఎంక్వయిరీ కోసం ఆఫీసులకెళ్తే పైనుంచి వచ్చిన ఆదేశాలతో అప్లికేషన్లన్నీ క్యాన్సిల్ చేశారని తేలికగా చెబుతున్నారు. అధికారులను గట్టిగా నిలదీస్తే.. గతంలో ఇచ్చినవి క్యాన్సల్ అయ్యాయి కనుక మళ్లీ కొత్త గా దరఖాస్తు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లకే ఈ గతి పడ్తే, కొత్తగా పెట్టుకునే అప్లికేషన్లతో తమ సమస్యలు ఎట్లా పరిష్కారమవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
