మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన

రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయాల్సిన రైతుబంధు డబ్బులను ఓ వ్యవసాయశాఖ అధికారి తన తెలివి తేటలతో తన బంధువు అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మూడు రోజులుగా బాధిత రైతులు ధర్నా చేస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చెరువు తండాకు చెందిన 39 మంది రైతులకు రూ.12 లక్షల రైతుబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి.  అయితే..ఈ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారి.. తన బంధువు అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశాడు. తమకు రైతుబంధు పథకం డబ్బులు పడటం లేదని వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు సదరు అధికారి. దీనిపై బాధిత రైతులు పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. 

తమ డబ్బులను వ్యవసాయ శాఖ అధికారి తన బంధువు అకౌంట్ లోకి పంపించుకున్నాడని తెలిసి బాధితులు లబోదిబోమన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మూడు రోజులుగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుటే ఆందోళన చేస్తున్నారు. ఆందోళన విరమించకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తమనే బెదిరిస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు రైతులు.