పంటల సాగు ఖర్చు తగ్గించుకుంటే రైతుకు లాభం: సీఎం జగన్

పంటల సాగు ఖర్చు తగ్గించుకుంటే రైతుకు లాభం: సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన పాలన–మీ సూచన పేరుతో  ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్… 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశానన్నారు. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారని తెలిపారు.

ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించామన్నారు సీఎం జగన్. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. ఈ మూడు ప్రధాన అంశాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో 70 శాతం రైతులు హెక్టార్‌లోపు మాత్రమే ఉన్నారని చెప్పారు. రైతు భరోసా- పీఎం కిసాన్‌ ద్వారా రూ.13500 పంటసాయం అందిస్తున్నామన్నారు. రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచామని స్పష్టం చేశారు. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అందిస్తామన్నారు సీఎం జగన్.