రైతులే బ్రిడ్జి కట్టుకున్నరు .. రూ.8.30 లక్షల సొంత నిధులతో నిర్మాణం

రైతులే బ్రిడ్జి కట్టుకున్నరు .. రూ.8.30 లక్షల సొంత నిధులతో నిర్మాణం

కొడిమ్యాల, వెలుగు : ‘కాల్వపై బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.. బ్రిడ్జి కట్టండి’ అంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లంచెరువు రైతులు.. లీడర్లు, ఆఫీసర్ల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగారు. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సొంతంగా లక్షలాది రూపాయలు పోగు చేసి, నెలల తరబడి కష్టపడి బ్రిడ్జి కట్టుకొని.. ఏండ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... బొల్లంచెరువు గ్రామాన్ని ఆనుకొని ఓ కాల్వ పారుతుండడం, దానిపై బ్రిడ్జి లేకపోవడంతో అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లడం కష్టంగా మారింది. రైతులు తప్పనిపరిస్థితుల్లో కాల్వను దాటి వెళ్తుండేవారు. 

వర్షాకాలంలో అయితే కాల్వను దాటడం సాధ్యం కాకపోవడం, ట్రాక్టర్లు, వరికోత యంత్రాల రాకపోకలు సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో ఈ కాల్వపై బ్రిడ్జిని నిర్మించాలంటూ ఏండ్ల తరబడి ఆఫీసర్ల చుట్టూ తిరిగినా స్పందన లేకుండా పోయింది. దీంతో రైతులే చందాలు వేసుకొని బ్రిడ్జి నిర్మించుకోవాలంటూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కాల్వ అవతల పొలాలు ఉన్న రైతులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జమ చేసుకున్నారు. మొత్తం రూ. 8.30 లక్షలు కావడంతో ఆరు నెలల కింద బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. నిర్మాణం పూర్తికావడంతో బ్రిడ్జిని బుధవారం ప్రారంభించుకున్నారు.