
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని రైతు కమిషన్కోరింది. తడిసిన ధాన్యాన్నికూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించింది. ఈ మేరకు సీఎంకు రైతు కమిషన్ శనివారం లెటర్ రాసింది. “మొంథా తుఫాన్” ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తుచేసింది.
వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు బాగా పండినప్పటికీ వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించింది. గత 70 ఏండ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం ఈ సీజన్‌లో నమోదైందని తెలిపింది. ఒక్క వరంగల్ జిల్లాలోనే 41.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని, రైతులు కోసిన పంటలు నీటిలో మునిగిపోయాయని చెప్పింది. నిల్వ ఉంచుకున్న పత్తి తడవడంతో భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది.
అలాగే.. వానాకాలం సీజన్‌లో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్, రీస్ట్రక్చర్ చేయాలని, ప్రస్తుత విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది. తడిసిన ధాన్యాన్ని కోళ్ల ఫారాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెసర, మినుము, కుసుమ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సీడీపై అందించాలని ముఖ్యమంత్రికి రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఆదిలాబాద్ ప్రాంతంలో సోయాబీన్ పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని.. తేమ శాతం మినహాయించి రైతుల వద్ద ఉన్న పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ చేసింది