హైదరాబాద్, వెలుగు: రైతుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని, రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలో 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 57.90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. 23 పంటలకు మద్దతు ధర చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. పత్తి కొనుగోళ్లకు కేంద్రం ఆంక్షలు విధించి ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామనడం సరికాదన్నారు.
నకిలీ విత్తనాల విషయంలో సర్కార్సీరియస్..
నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కోదండరెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తీసుకువచ్చిన “సెల్ఫ్ సర్టిఫికేషన్” విధానంతో కంపెనీలకే అధికారం వెళ్లిపోయిందని విమర్శించారు. కొత్త విత్తనాలను వ్యవసాయ శాఖ ధ్రువీకరించి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతే రైతులకు విక్రయించాల్సి ఉంటుందని చెప్పారు. రైతులను రక్షించేలా కఠినమైన జీవో తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ 2014 నుంచే దెబ్బతిన్నదని, రైస్ మిల్లర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో సమస్యలు పెరిగాయని అన్నారు. పంటల మార్పిడిపై ఈ ఏడాది జనవరిలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెరిగేలా పంటల వైవిధ్యీకరణపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రైతు కమిషన్ సూచించింది.
