కరెంట్ షాక్ తో రైతన్న మృతి

కరెంట్ షాక్ తో రైతన్న మృతి

వికారాబాద్,వెలుగు: కరెంట్ వైర్లు తగిలి ఓ పాడి రైతు, అతడి 3 బర్రెలు చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన బేగరి అంజిలయ్య(50)కి 3 బర్రెలున్నాయి. మంగళవారం అంజిలయ్య బర్రెలను తీసుకుని దిర్సంపల్లి దారిలో ఉన్న పొలానికి వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కొమ్మగారి రాజిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కరెంట్ వైర్లు తెగిపడి ఉన్నాయి. దీంతో నేలపై ఉన్న కరెంట్​వైర్లు తగిలి రైతు అంజిలయ్య అక్కడిక్కడే చనిపోయాడు. అతడి 3 బర్రెలూ కరెంట్ షాక్ తో మృత్యువాత పడ్డాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్తు​ అధికారులు వచ్చే వరకు అంజిలయ్య డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించేదిలేదంటూ కుటుంబీకులు, బందువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కుటుంబీకులు, గ్రామస్థులను తీసుకెళ్లి విద్యుత్తు అధికారులతో చర్చలు జరిపారు.  దీంతో వారు అందోళన విరమించారు. అంజిలయ్య భార్య రాములమ్మ కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.