గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు

ఆసిఫాబాద్, వెలుగు: పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా వాంకిడి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు.  గురువారం నేషనల్​ హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. క్వింటాల్​పత్తికి రూ.12 వేలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. పెరిగిన విత్తనాలు, ఎరువులు ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, అధిక వర్షాలకు దిగుబడి తగ్గిందని వాపోయారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆగమవుతామన్నారు.

అర గంట పాటు ధర్నా నిర్వహించడంతో హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ రహీమెద్దీన్ అక్కడికి చేరుకుని రైతుల నుంచి వినతిపత్రం తీసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధర్నాలో సర్పంచులు తుకారం, పవన్, జంగు, ఆరె సంఘం నాయకుడు జైరాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, వందల మంది రైతులు పాల్గొన్నారు. అలాగే పత్తికి మద్దతు ధరగా కనీసం రూ.10 వేలు చెల్లించాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సర్పంచులు, ఎంపీటీసీలు  గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వ్యాపారులు సిండికేట్​అయి ధరలు తగ్గించారని ఆయన ​దృష్టికి తీసుకెళ్లారు.